
కేరళ లిటరేచర్ ఫెస్టివల్ కు సునీతా విలియమ్స్
నాసా మాజీ వ్యోమగామి సునీతా విలియమ్స్ 2026 జనవరి 22 నుంచి ప్రారంభం కానున్న తొమ్మిదో కేరళ లిటరేచర్ ఫెస్టివల్ (కేఎల్ఎఫ్)లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని మంగళవారం ఉత్సవ నిర్వాహకులు ప్రకటించారు. 60 ఏళ్ల సునీతా విలియమ్స్ ఇప్పటివరకు అంతరిక్షంలో 300 రోజులకుపైగా గడిపారు. కేఎల్ఎఫ్ వేదికపై ఆమె భూమిని దాటి చేసిన తన ప్రయాణాల అనుభవాలను పంచుకోనున్నారు. శాస్త్ర విజ్ఞానం, అంతరిక్ష అన్వేషణ, నాయకత్వం, సహనశక్తి, అలాగే మానవ జిజ్ఞాస అపార శక్తి వంటి అంశాలపై ఆమె ప్రసంగించనున్నారు.
కేఎల్ఎఫ్ చీఫ్ ఫెసిలిటేటర్, డీసీ బుక్స్ మేనేజింగ్ డైరెక్టర్ రవి డీసీ మాట్లాడుతూ కేరళ లిటరేచర్ ఫెస్టివల్ సాహిత్యానికి మాత్రమే పరిమితం కాకుండా శాస్త్రం, ఆవిష్కరణలు, నాయకత్వం, మానవ ఆత్మను కూడా ఆవిష్కరించాలనే భావనతో ముందుకు సాగుతోంది. తెలియని లోకాలను అన్వేషించేందుకు కావాల్సిన ధైర్యానికి, మానవ పరిమితులను దాటే క్రమశిక్షణకు సునీతా విలియమ్స్ ప్రతీక. ఆమె ఈ ఫెస్టివల్ కు రావడం అన్ని తరాల ప్రేక్షకులకు ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. గత ఏడాది జూన్‌లో బుచ్ విల్మోర్‌తో కలిసి తన మూడో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర (ఐఎస్ఎస్) మిషన్‌లో పాల్గొన్న సునీతా విలియమ్స్ 286 రోజులపాటు అక్కడ కొనసాగారు. ఈ మిషన్ సమయంలో మహిళలలో అత్యధిక కాలం స్పేస్‌వాక్ చేసిన వ్యోమగామిగా ఆమె చరిత్ర సృష్టించారు.
అమెరికా నేవీ మాజీ కెప్టెన్ అయిన సునీతా విలియమ్స్, 1965 సెప్టెంబర్ 19న ఓహియో రాష్ట్రంలోని యూక్లిడ్‌లో జన్మించారు. గుజరాత్‌లోని మెహసానా జిల్లా జూలాసన్‌కు చెందిన దీపక్ పాండ్య ఆమె తండ్రి కాగా, స్లోవేనియన్ మూలాలు కలిగిన ఉర్సులిన్ బోనీ పాండ్య ఆమె తల్లి. 1998లో నాసా ద్వారా వ్యోమగామిగా ఎంపికైన సునీతా విలియమ్స్, హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌లో శిక్షణ పొందారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సంబంధించి రష్యా సహకారంపై మాస్కోలో రష్యన్ స్పేస్ ఏజెన్సీతో కూడా పని చేశారు.
కేఎల్ఎఫ్ 2026లో ప్రపంచవ్యాప్తంగా 500 మందికి పైగా వక్తలు పాల్గొననుండగా, ఈ ఏడాది గెస్ట్ నేషన్‌గా జర్మనీ నిలవనుంది. నోబెల్ విజేతలు అబ్దుల్ రజాక్ గుర్నా, ఒల్గా టోకార్జుక్, అభిజిత్ బెనర్జీతో పాటు బుకర్ ప్రైజ్ విజేత బాను ముష్తాక్, పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయి, ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణియన్, రచయితలు శోభా డే, అమిష్ త్రిపాఠి తదితర ప్రముఖులు ఈ ఉత్సవంలో పాల్గొననున్నారు. గతంలోనూ నిర్వహించిన ఫెస్టివల్ ఎడిషన్ లకు ప్రపంచంలోని ప్రముఖులు హజరయ్యారు.
