
కేరళ మూకదాడి మృతుడి కుటుంబానికి రూ.30 లక్షల సహాయం
ఉత్తర కేరళలోని పాలక్కాడ్ జిల్లా వాలయార్ సమీపంలో జరిగిన అనుమానాస్పద మూకదాడి ఘటనలో మృతి చెందిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రామ్‌నారాయణ్ కుటుంబానికి రూ.30 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు కేరళ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ తిరువనంతపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ నిర్ణయం మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నట్లు తెలిపారు. ఈ మొత్తం సహాయాన్ని ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధి (సీఎండీఆర్ఫ్) నుంచి మంజూరు చేస్తామని వెల్లడించారు.
మంజూరైన రూ.30 లక్షల్లో రాంనారాయణ్ భార్యకు రూ.5 లక్షలు, తల్లికి రూ.5 లక్షలు ఇవ్వనుండగా, అతని ఇద్దరు పిల్లలకు రూ.10 లక్షల చొప్పున కేటాయించారు. పిల్లల పేర్లపై కేటాయించిన రూ.20 లక్షలను ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా పెట్టి, అందువల్ల వచ్చే వడ్డీని పిల్లల అవసరాల కోసం వారి తల్లికి అందజేస్తామని ముఖ్యమంత్రి వివరించారు. చత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా రూ.5 లక్షల సహాయం ఇప్పటికే ప్రకటించింది.
నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తాం
ఈ హత్య రాష్ట్ర మనస్సాక్షిని కలచివేసిన ఘటనగా పేర్కొన్న విజయన్, ఉపాధి కోసం కేరళకు వచ్చిన రాంనారాయణ్ తన కుటుంబాన్ని పోషించేందుకు శ్రమిస్తున్నాడని చెప్పారు. అతని మృతి తరువాత భార్య, తల్లి, ఇద్దరు చిన్నారులు జీవనాధారం లేకుండా మిగిలిపోయారని తెలిపారు. ఈ దారుణ ఘటనలో పాల్గొన్న వారందరినీ చట్టం ముందు నిలబెట్టాం. వారికి గరిష్ట శిక్ష పడేలా ప్రభుత్వం న్యాయపరమైన చర్యలు తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. విద్వేష భావజాలంతో నడిచే కొందరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని, నిందితుల్లో కొందరికి క్రిమినల్ నేపథ్యం, సామూహిక విద్వేష దృక్పథం ఉందని విజయన్ ఆరోపించారు. ఉత్తర భారత రాష్ట్రాల్లో కొన్ని చోట్ల సాగుతున్న మాబ్ హింస సంస్కృతిని కేరళలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆయన అన్నారు. దాడిని సమర్థించేందుకు మృతుడిని బంగ్లాదేశీ వలసదారుడుగా ముద్ర వేయడానికి ప్రయత్నించారని విమర్శించిన సీఎం, ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి అని, కేరళలో అలాంటి ప్రయత్నాలకు అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు.
కేరళ మానవతా విలువలను గుర్తు చేస్తూ, ఇటీవల ఎర్నాకులం జనరల్ ఆసుపత్రిలో జరిగిన గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయన్ ప్రస్తావించారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి దానం చేసిన గుండెను నేపాల్‌కు చెందిన దుర్గా కమినికి మార్పిడి చేయడం మతం, భాష, జాతీయతకు అతీతంగా కేరళలోని సోదరభావ సంస్కృతిని ప్రతిబింబిస్తుందని అన్నారు. ఇలాంటి మానవీయ చర్యలతో కేరళ తన మానవీయతను చూపిస్తే, విధ్వంసకర శక్తులు దాన్ని చెరిపేయాలని చూస్తాయి. అందుకే మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం హెచ్చరించారు.సామూహిక విద్వేషం, హింసను ప్రోత్సహించే శక్తులకు గట్టి ప్రతిఘటన తప్పదని విజయన్ స్పష్టం చేశారు. కేరళ లౌకిక స్వభావాన్ని దెబ్బతీయడం ఎవరి వల్లా కాదని, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు రాష్ట్రంలో సామూహిక ఉద్రిక్తతలు సృష్టించేందుకు చేసిన ప్రయత్నాలు గతంలోనూ విఫలమయ్యాయని అన్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం, 31 ఏళ్ల రాంనారాయణ్‌పై దొంగతనానికి పాల్పడ్డాడన్న అనుమానంతో వాలయార్ సమీపంలోని కిజకెట్టప్పల్లం ప్రాంతంలో మూక దాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దాడి వెనుక ఆర్ఎస్ఎస్ కార్యకర్తల పాత్ర ఉందని అధికార పార్టీ సీపీఐ(ఎం) ఆరోపించింది.
