
కేరళ ప్రచారంలో రేవంత్ రెడ్డివి పచ్చి అబద్ధాలు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు పూర్తిగా విఫలమయ్యాయని, అమలు చేయని పథకాలను అమలు చేసినట్లు కేరళ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పడం కేరళ ప్రజలను వంచించడమేనని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ తీరును తీవ్రంగా ఎండగట్టారు.
తెలంగాణలో ఏ ఒక్క పథకం కూడా సమర్థవంతంగా అమలు కాలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. మహిళలకు నెలకు రూ. 2,500, పెన్షన్ల పెంపు, దళిత కుటుంబాలకు రూ. 12 లక్షలు, బీసీలకు లక్ష కోట్లు.. ఇవన్నీ ఏమయ్యాయి? పెళ్లయిన ఆడబిడ్డలకు తులం బంగారం, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, ఎలక్ట్రిక్ స్కూటర్ల హామీలు ఎక్కడికి పోయాయి? అని ఆయన ప్రశ్నించారు. అమలు చేయని హామీలను చేశామని చెప్పడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని, ఇది తెలంగాణ ప్రజలను దగా చేయడమేనని ధ్వజమెత్తారు.
కేరళలో రేవంత్ రెడ్డి పర్యటనపై అనుమానాలు
రేవంత్ రెడ్డి కేరళ వెళ్లడం వెనుక రాజకీయాల కంటే ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ నుంచి నిధులు పంపుతున్నారనే ప్రచారం జరుగుతోందని, అక్కడ ఆయన మాటలకు ఎలాంటి విలువ లేదని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను ఎలా తుంగలో తొక్కారో, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే మార్గంలో పయనిస్తున్నారని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మేడిగడ్డ పిల్లర్లకే పరిమితం కాకుండా, ప్రాజెక్టు మొత్తాన్ని సీబీఐ విచారణకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతామని, లక్ష కోట్లు వసూలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా ఒక్క చర్య కూడా ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. తమ అసమర్థతను దాచుకోవడానికే బీజేపీపై నెపం వేస్తున్నారని, హామీలు అమలు చేయాల్సిన బాధ్యత పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
