
కేరళ పేరు మార్పునకు కేంద్ర కేబినెట్ ఆమోదం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు ‘కేరళ’ రాష్ట్రం పేరును అధికారికంగా ‘కేరళం’గా మార్చేందుకు కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ‘సేవా తీర్థ్’లో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తదుపరి ప్రక్రియ
కేబినెట్ ఆమోదం అనంతరం ‘కేరళ (అల్టరేషన్ ఆఫ్ నేమ్) బిల్, 2026’ను భారత రాష్ట్రపతి కేరళ శాసనసభకు పంపిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాలను కోరడం తప్పనిసరి. అసెంబ్లీ అభిప్రాయాలు అందిన తర్వాత, రాష్ట్రపతి సిఫార్సుతో బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబడుతుంది. పార్లమెంట్ ఆమోదం అనంతరం రాజ్యాంగపు తొలి షెడ్యూల్‌లో ‘కేరళ’ స్థానంలో ‘కేరళం’ పేరును చేర్చనున్నారు.
అసెంబ్లీ తీర్మానం
కేరళ శాసనసభ 2024 జూన్ 24న ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించి, రాష్ట్ర అధికారిక పేరును మలయాళంలో వాడుకలో ఉన్నట్లుగా కేరళంగా మార్చాలని కేంద్రాన్ని కోరింది.తీర్మానంలో, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ భాషా ఆధారంగా 1956 నవంబర్ 1న జరిగింది. మలయాళంలో మా రాష్ట్రం పేరు కేరళం. అయితే రాజ్యాంగ తొలి షెడ్యూల్‌లో కేరళగా నమోదైంది. దానిని సవరించాలని పేర్కొన్నారు.
చట్టపరమైన అంశాలు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం, పార్లమెంట్ చట్టం ద్వారా రాష్ట్రాల పేర్లు మార్చవచ్చు. అయితే బిల్లు ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి సిఫార్సు తప్పనిసరి. పేరు, సరిహద్దులు లేదా విస్తీర్ణం ప్రభావితమయ్యే సందర్భాల్లో సంబంధిత రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం కోరాలి. ఈ అంశాన్ని కేంద్ర గృహ మంత్రిత్వశాఖ పరిశీలించి, హోం మంత్రి అమిత్ షా ఆమోదంతో కేబినెట్ నోట్ సిద్ధం చేసింది. న్యాయశాఖ, శాసన విభాగం కూడా ప్రతిపాదనకు సమ్మతి తెలిపినట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.ఇక పార్లమెంట్ ఆమోదం లభిస్తే కేరళ రాష్ట్రం అధికారికంగా కేరళంగా మారనుంది.
ఇటీవలి కాలంలో రాష్ట్రాల పేర్ల మార్పులు
దేశంలో ఇటీవలి సంవత్సరాల్లో కొన్ని రాష్ట్రాల పేర్లు అధికారికంగా మారాయి. ముఖ్యంగా 2011లో ఒడిశా రాష్ట్రం పేరు మార్పు చివరిసారిగా రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి వచ్చింది.
ఒడిశా
గతంలో ఒరిస్సా గా పిలిచిన ఈ రాష్ట్రాన్ని 2011లో 113వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఒడిశాగా మార్చారు. అదే సవరణ ద్వారా ఒరియా భాషను ఒడియగా సవరించారు.
ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్ రాష్ట్రం 2000లో ఏర్పడినప్పుడు ఉత్తరాంచల్ గా పేరు పెట్టారు. అనంతరం 2007లో అధికారికంగా ఉత్తరాఖండ్ గా పేరు మార్చారు.
కర్ణాటక
ప్రస్తుత కర్ణాటక రాష్ట్రం 1973కు ముందు మైసూర్ స్టేట్ గా పిలిచేవారు.1973లో రాష్ట్రానికి కర్ణాటకగా పేరు మార్చారు.
తమిళనాడు
తమిళనాడు రాష్ట్రం 1969 వరకు మద్రాస్ స్టేట్ గా ఉండేది. ఆ సంవత్సరంలో అధికారికంగా తమిళనాడుగా మారింది.
పశ్చిమ బెంగాల్ – ప్రతిపాదన
పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని బంగ్లా గా పేరు మార్చాలని 2018లో రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి తుది ఆమోదం ఇంకా లభించలేదు. ఇటీవలి కాలంలో రాజ్యాంగ సవరణతో అమలైన చివరి అధికారిక రాష్ట్ర పేరు మార్పు 2011లో ఒడిశా రాష్ట్రానిదే.
పేరు మార్పుపై శశిథరూర్ చమత్కారం
కేరళ పేరును కేరళంగా మార్చే కేంద్ర కేబినెట్ నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ చమత్కార వ్యాఖ్యలు చేశారు. థరూర్ సోషల్ మీడియాలో స్పందించారు. పేరు మార్పు మంచిదే. కానీ ఆంగ్లంలో ‘కేరళైట్’, ‘కేరళన్ ’ అనే పదాలు ఇప్పుడు ఎలా మారతాయి? ‘కేరళమియన్ ’ అంటే సూక్ష్మజీవిలా వినిపిస్తోంది, ‘కేరళమైట్ ’ అంటే అరుదైన ఖనిజంలా ఉందని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అలాగే ఈ ఎన్నికల ఉత్సాహంలో పుట్టే కొత్త పదాల కోసం @CMOKerala ఒక పోటీ నిర్వహించాలని సూచించారు.
