
కేరళ పాలక్కాడ్ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు నమోదు
కేరళలోని పాలక్కాడ్ ఎమ్మెల్యే (ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు) రాహుల్ మామ్‌కూటత్తిల్ చిక్కుల్లో పడ్డారు. ఒక మహిళ తనపై అత్యాచారం చేశాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, బలవంతంగా గర్భస్రావం చేయించాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎమ్మెల్యేపై అత్యాచారం, గర్భస్రావం చేయించడం, దౌర్జన్యం, అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించడం, బెదిరించడం వంటి పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
బాధితురాలు నేరుగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ని కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు ప్రక్రియ వేగవంతమైంది. ఫిర్యాదుతో పాటు వాట్సాప్ చాట్‌లు, ఆడియో రికార్డింగ్‌ల వంటి ఆధారాలను కూడా ఆమె సమర్పించారు. కేసు నమోదు కాగానే ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కూటత్తిల్ తన మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారీలో ఉన్నారు. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. కాగా ఆయన బెయిల్ కోసం న్యాయవాదులను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే స్నేహితుడైన జాబీ జోసెఫ్ కూడా నిందితుడిగా చేర్చారు. గర్భస్రావం కోసం మందులు ఇచ్చింది ఇతనే అని ఆరోపణ ఉంది.
గతంలోనూ ఆరోపణలు
మలయాళ నటి రిని ఆన్ జార్జ్ ఒక యువ నాయకుడిపై దుష్ప్రవర్తన ఆరోపణలు చేయడంతో బీజేపీ, సీపీఎం యువజన విభాగమైన డీవైఎఫ్‌ఐ నిరసనలకు దిగగా, మామ్‌కూటత్తిల్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజీనామా చేశారు. ఆయనపై పలువురు మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ కూడా ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆగస్టు 25న కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆయనను సస్పెండ్ చేసింది.
కేరళ రాజకీయాల్లో దుమారం
ఈ విషయం ఇప్పుడు కేరళ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఈ కేసు కాంగ్రెస్‌కు పెద్ద ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కాసర్గోడ్ ఎంపీ రాజ్‌మోహన్ ఉన్నితన్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే తన చర్యల వల్ల తానే ఈ పరిస్థితిని తెచ్చుకున్నారని విమర్శించారు. అయితే, ఇతర కాంగ్రెస్ నాయకులు మాత్రం, పార్టీ ఇప్పటికే రాహుల్‌ను సస్పెండ్ చేసిందని, ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. సీపీఎం, బీజేపీ పార్టీల నాయకులు రాహుల్ మామ్‌కూటత్తిల్ వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేను కాంగ్రెస్, యూడీఎఫ్ కూటమి కాపాడుతోందని ఆరోపిస్తున్నారు.
మాజీ డీజీపీ, ప్రస్తుత బీజేపీ నాయకురాలు ఆర్.శ్రీలేఖ స్పందిస్తూ, బాధితురాలికి మద్దతు తెలిపారు. అయితే ఈ ఫిర్యాదు ఇంత ఆలస్యంగా ఎందుకు నమోదైందని, బాధితురాలు ముఖ్యమంత్రి వద్దకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ఆమె ప్రశ్నించారు. కాగా ఈ కేసుపై దర్యాప్తును ఒక ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తోంది. త్వరలోనే బాధితురాలి వాంగ్మూలాన్ని కోర్టులో రహస్యంగా నమోదు చేసే అవకాశం ఉంది.
