Let's talk: editor@tmv.in
కేరళ నటిపై లైంగిక దాడి కేసులో దిలీప్‌ నిర్దోషి

కేరళ నటిపై లైంగిక దాడి కేసులో దిలీప్‌ నిర్దోషి

Pinjari Chand
9 డిసెంబర్, 2025

కేరళ రాష్ట్రంలో 2017లో ఒక దక్షిణ భారత నటిపై జరిగిన లైంగిక దాడి కేసులో సోమవారం కేరళ కోర్టు మలయాళ నటుడు దిలీప్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేసింది. అదే సమయంలో నేరంలో పాల్గోన్న ముఖ్య నిందితుడు సునీల్ ఎన్‌ ఎస్ లేదా పల్సర్ సునీతో సహా మరో ఐదుగురిని దోషులుగా తేల్చింది. దిలీప్‌తో పాటు మరో ముగ్గురు నిందితులను సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్టు పూర్తిగా నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ తీర్పును ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి హనీ ఎం వర్గీస్ ప్రకటించారు. నవంబర్ 25న దీర్ఘకాలిక విచారణ ముగిసిన తర్వాత, ఈ రోజు కిటకిటలాడుతున్న కోర్టు గదిలో తీర్పు వెలువరించారు. సీపీఐ(ఎం) పార్టీ ఈ విషయంలో ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేస్తుందని ప్రకటించింది.

సునీల్‌తో పాటు దోషులుగా తేలిన వారు

మార్టిన్ ఆంటోనీ, మణికందన్ బీ, విజేష్ వీపీ, సలీం హెచ్, ప్రదీప్ ఉన్నారు. వీరిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 12న శిక్షా విధింపుపై కోర్టు విచారణ చేయనుంది. మొదటి ఆరుగురు నిందితులు అన్ని ఆరోపణలలోనూ దోషులుగా తేలగా, దిలీప్, మరో ముగ్గురు పూర్తిగా నిర్దోషులుగా విడుదలయ్యారు. 2017 ఫిబ్రవరి 17 రాత్రి నటి ప్రయాణిస్తున్న కారులోకి దుండగులు బలవంతంగా చొరబడి, రెండు గంటల పాటు కారును తమ అదుపులో ఉంచుకుని, ఆ తర్వాత జనసాంద్రత ఉన్న ప్రాంతంలో వదిలి పారిపోయారు. ఈ ఘటన కేరళ సమాజాన్ని కుదిపేసింది. ఘటన తర్వాత పోలీసులు నిందితులను అరెస్టు చేసి, 2017 ఏప్రిల్‌లో ఏడుగురిపై మొదటి ఛార్జిషీట్ దాఖలు చేశారు. తదుపరి దర్యాప్తులో జులై 10, 2017న దిలీప్‌ను అరెస్టు చేశారు. ముఖ్య నిందితుడు సునీల్ జైలు నుంచి దిలీప్‌కు ఒక లేఖ పంపినట్టు గుర్తించారు. అక్టోబర్ 3, 2017న దిలీప్‌కు బెయిల్ మంజూరైంది.

హైకోర్టులో అప్పీలు కు వెళతాం

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ మాట్లాడుతూ బాధిత నటికి పూర్తి న్యాయం జరిగేలా హైకోర్టులో అప్పీల్ దాఖలు చేస్తామని చెప్పారు. 2017 నవంబర్‌లో దిలీప్‌తో సహా మరో ఏడుగురిపై అదనపు ఛార్జిషీట్ దాఖలైంది. వీరిలో ఐదుగురు తర్వాత నిర్దోషులుగా విడుదలయ్యారు. దాంతో పాటు సాక్షులుగా మారారు.

లభించని సాక్ష్యాలు

దాడి దృశ్యాలను రికార్డు చేసిన మొబైల్ ఫోన్ ఇప్పటికీ లభ్యం కాలేదు. కానీ ఒక న్యాయవాది కోర్టుకు సమర్పించిన మెమరీ కార్డులోని వీడియోలపై పోలీసులు ఆధారపడ్డారు. అయితే ఫోన్ దొరకనిదే మొమరీ కార్డు ఏవిధంగా దొరికింది?

ఎందుకు మొమరీ కార్డును పలుసార్లు యాక్సెస్ చేశారు? చేసిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కేసులో మొదటి నుంచి ప్రాసిక్యూషన్ దిలీప్ మాజీ భార్య మంజు వారియర్‌తో బాధిత నటి మాట్లాడిన తర్వాత, 2016లో ఒక స్టేజ్ ఈవెంట్ రిహార్సల్ సమయంలో దిలీప్‌తో ఆమెకు గొడవ జరిగిందని వాదిస్తున్నారు. ఆ తర్వాత కొచ్చిలోని ఒక హోటల్‌లో కుట్ర పన్నినట్టు ప్రాసిక్యూషన్ వాదించింది. కేసు లాగానే విచారణ కూడా అనేక మలుపులు తిరిగింది. 2019లో దిలీప్ సీబీఐ దర్యాప్తు కోరుతూ కేరళ హైకోర్టును ఆశ్రయించాడు, కానీ తిరస్కరించింది. అదే సంవత్సరం సుప్రీంకోర్టు ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. కానీ నిందితులు ప్రాసిక్యూషన్, బాధితురాలు హైకోర్టులకు దాఖలు చేసిన పిటిషన్లు, కోవిడ్ మహమ్మారి వల్ల విచారణ ఆలస్యమైంది. చివరిగా 2020 జనవరిలో విచారణ ప్రారంభమైంది. తర్వాత స్పెషల్ ప్రాసిక్యూటర్ ఏ సురేశన్ రాజీనామా చేశారు. 2020 డిసెంబర్‌లో విచారణను మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. 2021 డిసెంబర్ 29న చివరి సాక్షి పరీక్ష సమయంలో కొత్త సమాచారం లభించిందని మరింత దర్యాప్తు కోరారు. దర్శకుడు బాలచంద్రకుమార్ ఇచ్చిన సమాచారం ఆధారంగా దిలీప్ దగ్గర బాధితురాలి వీడియోలు ఉన్నాయని, దర్యాప్తు అధికారులను హాని చేయడానికి కుట్ర పన్నాడని మరో కేసు నమోదైంది. విచారణ పునఃప్రారంభమైనప్పుడు వి.ఎన్. అనిల్‌కుమార్ స్పెషల్ ప్రాసిక్యూటర్‌గా నియమితులై రాజీనామా చేశారు. తర్వాత వి. అజాకుమార్ నియమితులయ్యారు.2022లో కోర్టు అదుపులో ఉన్న మెమరీ కార్డును అక్రమంగా యాక్సెస్ చేశారని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ కొట్టివేసినా, హైకోర్టు వాస్తవ పరిశోధనకు ఆదేశించింది. మెమరీ కార్డును మేజిస్ట్రేట్, ఆ తర్వాత జిల్లా సెషన్స్ కోర్టు అధికారులు యాక్సెస్ చేశారని తేలింది. ఈ సంఘటన తర్వాత 2023 డిసెంబర్‌లో లైంగిక దృశ్యాలు ఉన్న ఆధారాలను నిర్వహించే విధానంపై హైకోర్టు వివరణాత్మక మార్గదర్శకాలు జారీ చేసింది.

విచారణలో మొత్తం 261 మంది సాక్షులను పరీక్షించారు, వీరిలో చాలామంది సినిమా రంగానికి చెందినవారు. చాలా మంది నటీనటులు మాట్లాడారు. దర్యాప్తు అధికారి ఒక్కరినే 109 రోజుల పాటు విచారించింది. 834 డాక్యుమెంట్లను కోర్టు అంగీకరించింది, ఇద్దరు డిఫెన్స్ సాక్షులను విచారించింది. విచారణ సమయంలో మాజీ ఎమ్మెల్యే పీటీ థామస్, దర్శకుడు బాలచంద్రకుమార్ మరణించారు.