Let's talk: editor@tmv.in
కేరళ ఎన్నికల ప్రచారంలో మోడీ, పినరయి విజయన్‌లపై ప్రియాంకా గాంధీ నిప్పులు

కేరళ ఎన్నికల ప్రచారంలో మోడీ, పినరయి విజయన్‌లపై ప్రియాంకా గాంధీ నిప్పులు

Dantu Vijaya Lakshmi Prasanna
8 ఏప్రిల్, 2026

వయనాడు ఎంపీ, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌లపై తీవ్ర విమర్శల చేశారు. పశ్చిమాసియా (గల్ఫ్) దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న లక్షలాది మంది భారతీయుల, ముఖ్యంగా కేరళీయుల భద్రత పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి ప్రణాళిక లేదని ప్రియాంకా గాంధీ తీవ్రంగా మండిపడ్డారు.

గల్ఫ్ ప్రాంతంలో ఉపాధి పొందుతున్న వారిని క్షేమంగా తిరిగి తీసుకురావడానికి లేదా వారి రక్షణకు మోడీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ఆమె ఆరోపించారు. ప్రధాని మోడీ అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు తలొగ్గి వ్యవహరిస్తున్నారని, తన స్వప్రయోజనాల కోసమే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె విమర్శించారు. కేరళం ప్రజల జీవనాధారమైన గల్ఫ్ వలసదారుల భవిష్యత్తును అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేశాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

విదేశీ విరాళాల నియంత్రణ చట్టంకి ప్రతిపాదించిన సవరణల ద్వారా ప్రధాని మోడీ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ప్రియాంక ఆరోపించారు. ఈ మార్పుల వల్ల అనేక సేవా సంస్థలు, ముఖ్యంగా క్రైస్తవ మిషనరీ సంస్థలు మూతపడే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. ఇది సమాజంలోని అణగారిన వర్గాలకు అందుతున్న సాయాన్ని నిలిపివేయడమేనని ఆమె అభిప్రాయపడ్డారు.

బీజేపీ ప్రభుత్వం మతపరమైన వివక్షతో నిర్ణయాలు తీసుకుంటోందని, తద్వారా దేశంలోని లౌకిక స్ఫూర్తిని దెబ్బతీస్తోందని ఆమె విమర్శించారు. అభివృద్ధి కంటే మత రాజకీయాలకే కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందని ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు.

కేరళంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని ప్రియాంక సంచలన ఆరోపణలు చేశారు. పినరయి విజయన్ ప్రభుత్వంపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు.

ప్రతిపక్ష నేతలపై దాడులు చేసే కేంద్ర సంస్థలు, కేరళం ముఖ్యమంత్రి విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నాయని ఆమె నిలదీశారు. తన నాయకత్వాన్ని అవినీతి కేసుల నుండి కాపాడుకోవడానికి సీఎం విజయన్ బీజేపీతో చేతులు కలిపారని, అందుకే రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ఎల్డీఎఫ్ మెతక వైఖరి అవలంబిస్తోందని ఆమె ఆరోపించారు.

వయనాడు జిల్లాలోని గిరిజన తెగల దుస్థితిపై ప్రియాంక ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి లేకపోవడం వల్ల మద్యపానం పెరిగిపోతోందని, పోషకాహార లోపం కారణంగా చిన్నారులు, మహిళలు రక్తహీనత వంటి వ్యాధుల బారిన పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. గిరిజన పిల్లలకు సమాన విద్యావకాశాలు అందడం లేదని, తద్వారా వారు పాఠశాలలకు దూరమవుతున్నారని విమర్శించారు. గిరిజనుల విశిష్ట సంస్కృతి, భాషలు అంతరించిపోతున్నాయని, వారిని ఆదుకోవడంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని ఆమె విమర్శించారు. మానవాళికి పునాదులైన వారి సంప్రదాయాలను రక్షించాల్సిన బాధ్యతను పాలకులు విస్మరించారని అన్నారు.

ముండకై-చూరల్మల కొండచరియలు విరిగిపడిన ఘటనలో సర్వం కోల్పోయిన బాధితుల కోసం కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తున్న గృహ నిర్మాణ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని ప్రియాంక ఆరోపించారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వం తన సొంత ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇచ్చుకుంటూ, కాంగ్రెస్ చేపట్టిన సేవా కార్యక్రమాలకు అనుమతులు నిరాకరించిందని ఆమె అన్నారు. ముస్లిం లీగ్ వంటి మిత్రపక్షాలు కూడా ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నాయని ఆమె తెలిపారు. బాధితులకు సాయం చేయడంలో కూడా రాజకీయం చేయడం ఎల్డీఎఫ్ ప్రభుత్వ సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని ఆమె దుయ్యబట్టారు. కాంగ్రెస్ నిధుల దుర్వినియోగంపై వస్తున్న వార్తలను ఆమె ఖండించారు.

కేరళంలో గత పదేళ్ల ఎల్డీఎఫ్ పాలనలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ప్రియాంక ఆరోపించారు. నిత్యావసర వస్తువులపై పన్నులు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారని, ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మాత్రం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం పనిచేస్తోందని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని ఆమె ధ్వజమెత్తారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కేరళంను సంక్షోభం నుండి రక్షించాలంటే యుడిఎఫ్ అధికారంలోకి రావాలని ఆమె పిలుపునిచ్చారు.

మలెనాడు ప్రాంతంలో క్రమంగా పెరుగుతున్న వన్యప్రాణుల-మానవ సంఘర్షణల గురించి ప్రియాంక ప్రస్తావించారు. అడవుల అంచున ఉన్న ప్రజలు ప్రాణభయంతో బతుకుతున్నారని, పంటలు నాశనమవుతున్నా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆమె విమర్శించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి రాజకీయ చిత్తశుద్ధి అవసరమని, కానీ ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి ఆ ధ్యాస లేదని ఆమె అన్నారు. వన్యప్రాణుల దాడుల నుండి ప్రజలను రక్షించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, తద్వారా రైతులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఏప్రిల్ 9న జరగనున్న కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని ప్రియాంక కోరారు. "కేంద్రంలో ఒక పిరికివాడు, రాష్ట్రంలో మరొక పిరికివాడు మనల్ని పాలిస్తున్నారు" అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. అభివృద్ధి రాజకీయాలు కావాలా లేక అవినీతి, మతతత్వ రాజకీయాలు కావాలా అని ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని ఆమె అన్నారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ల కోసమే పనిచేస్తోందని, సామాన్యుల సంక్షేమం కాంగ్రెస్ నాయకత్వంలోని యుడిఎఫ్ తోనే సాధ్యమని ఆమె స్పష్టం చేశారు. వయనాడు ప్రజలు తనకు అందించిన మద్దతును గుర్తు చేసుకుంటూ, రాష్ట్రవ్యాప్తంగా యుడిఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.