
కేరళ ఎన్నికల కోసం సమగ్ర విజన్ డాక్యుమెంట్: శశిథరూర్
కేరళలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) రాష్ట్రానికి సంబంధించిన సమగ్ర విజన్ డాక్యుమెంట్‌ను త్వరలో విడుదల చేయనుందని సీనియర్ కాంగ్రెస్ నేత శశి థరూర్ తెలిపారు. న్యూఢిల్లీలోని పీటీఐ ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేరళలో అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెంచే దిశగా పలు ఆలోచనలను ప్రజల ముందుకు తీసుకొస్తామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో యూడీఎఫ్ సందేశం ఏమిటన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ మాకు సంపన్నమైన కేరళ కావాలని స్పష్టం చేశారు.
పాలన ఎలా చేయాలో మాకు తెలుసు. కేంద్రంలోనూ, కేరళలోనూ పరిపాలించిన అనుభవం కాంగ్రెస్‌కు ఉందని థరూర్ అన్నారు. ఇదే సమయంలో రాష్ట్రాన్ని పాలిస్తున్న ఎల్‌డీఎఫ్ (ఎల్డీఎఫ్), అలాగే బీజేపీపై ఆయన పరోక్ష విమర్శలు చేశారు. అవినీతి కుంభకోణాలు, కేసుల కారణంగా ప్రజలు ఎల్‌డీఎఫ్‌పై నమ్మకం కోల్పోయారని, మరో పార్టీ సంప్రాదాయక ధోరణితో వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. మా ప్రణాళిక స్పష్టం — కేరళ కోసం ఒక డీటెయిల్డ్ విజన్ డాక్యుమెంట్‌ను తీసుకురావడమే అని ఆయన పునరుద్ఘాటించారు. ఇటీవల తనకు జరిగిన అన్యాయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన థరూర్, గత వారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నేత రాహుల్ గాంధీలను కలిసిన అనంతరం ఇప్పుడు అంతా బాగుంది… అందరం ఒకే అభిప్రాయంలో ఉన్నామని వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల క్రితం కొచ్చిలో జరిగిన కార్యక్రమంలో తనను పక్కన పెట్టే ప్రయత్నాలు జరిగాయన్న భావనతో థరూర్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
కేరళ పేరు రెండు సార్లే
ఇదిలా ఉండగా, ఆదివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026–27పై స్పందించిన థరూర్, ఆర్థిక మంత్రి ప్రసంగంలో కేరళకు సంబంధించి సంతోషపడే అంశాలు పెద్దగా లేవని అన్నారు. బడ్జెట్ పత్రాల్ని పూర్తిగా పరిశీలించిన తరువాతే, అది కేరళకు అనుకూలమా కాదా అన్నది చెప్పగలమన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ మళ్లీ అధికారంలోకి రావాలని, బీజేపీ తన రాజకీయ స్థానం బలోపేతం చేయాలని, ఎల్‌డీఎఫ్ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అంచనాలకు విరుద్ధంగా, ఎన్నికలు జరగనున్న రాష్ట్రమైన కేరళకు బడ్జెట్‌లో ప్రధానమైన ప్రత్యేక ప్రకటనలు లేవు. దాదాపు 90 నిమిషాల పాటు సాగిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంలో కేరళ పేరు కేవలం రెండుసార్లే ప్రస్తావనకు వచ్చింది. ఒకసారి రేర్ ఎర్త్ కారిడార్ల ఏర్పాటు సందర్భంలో, మరోసారి తాబేళ్ల సంరక్షణ ట్రైల్స్ (టర్టిల్ ట్రైల్స్) అంశంలో కేరళ ప్రస్తావనకు వచ్చింది. రేర్ ఎర్త్ ఖనిజాల తవ్వకం, ప్రాసెసింగ్, పరిశోధన, తయారీ కోసం ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రత్యేక కారిడార్లకు మద్దతు ఇస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. అలాగే, పర్యావరణానికి అనుకూలంగా పర్వత మార్గాలు, తీర ప్రాంతాల్లో టర్టిల్ ట్రైల్స్, పక్షి వీక్షణ మార్గాల అభివృద్ధి ప్రతిపాదనల్లో కూడా కేరళ చోటు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితుల మధ్య నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదవ బడ్జెట్‌ను ఆదివారం ప్రవేశపెట్టారు.
