Let's talk: editor@tmv.in
కేరళ ఎన్నికల్లో కొత్త మార్పులకు ఈసీఐ నాంది

కేరళ ఎన్నికల్లో కొత్త మార్పులకు ఈసీఐ నాంది

Pinjari Chand
8 మార్చి, 2026

ఈ ఏడాది జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారత ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా పలు కొత్త ఏర్పాట్లు చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం ఓటర్లు పోలింగ్ కేంద్రం గేటు వరకు మొబైల్ ఫోన్ తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. అభ్యర్థులను సులభంగా గుర్తించేందుకు ఈసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంస్) పై అభ్యర్థుల రంగు ఫోటోలు కూడా ఉంచనున్నట్లు తెలిపారు. అలాగే ఓటర్ల పోలింగ్ శాతం వివరాలను ప్రతి రెండు గంటలకు ప్రీసైడింగ్ అధికారి ECINET యాప్ ద్వారా నేరుగా అప్లోడ్ చేస్తారని చెప్పారు.

ఎన్నికల లెక్కింపులో భాగంగా పోస్టల్ బ్యాలెట్లను ఈవీఎం ఓట్ల కంటే రెండు రౌండ్లు ముందుగానే లెక్కిస్తారు. అలాగే ఫాం-17సీ, ఈవీఎం డేటా మధ్య తేడా ఉన్నప్పుడు వీవీప్యాట్ స్లిప్‌లను తప్పనిసరిగా లెక్కిస్తారు అని తెలిపారు. రాష్ట్రంలో ఓటర్ల ప్రక్షాళన జాబితా కార్యక్రమం (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ) చేపట్టినట్లు పేర్కొంటూ, అర్హులైన ఒక్క ఓటరినీ తొలగించకుండా, అనర్హులైన వారిని జాబితాలో చేర్చకుండా ఉండటమే లక్ష్యమని చెప్పారు.

ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బూత్‌లో గరిష్టంగా 1,200 మంది ఓటర్లకే పరిమితం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో 2.43 లక్షల దివ్యాంగ ఓటర్లు, 85 సంవత్సరాలకుపైబడిన రెండు లక్షలకుపైగా వృద్ధ ఓటర్లు ఉన్నారని, వీరికి ఇంటివద్ద నుంచే ఓటు వేసే అవకాశం ఇవ్వనున్నట్లు చెప్పారు. అలాగే 100 సంవత్సరాలకు పైబడిన 1,571 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. యువ ఓటర్లను ప్రోత్సహించేందుకు కళాశాలల్లో ప్రచారం నిర్వహించడానికి 138 ప్రత్యేక అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఏఈఆర్ఓస్) నియమించనున్నట్లు తెలిపారు. ఈ సమీక్షా పర్యటనలో ఎన్నికల సంఘం వివిధ జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఎన్నికల నిర్వహణపై సూచనలు స్వీకరించింది.