
కేరళలో లైంగిక వేధింపుల కేసులో పాలక్కాడ్ ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు
లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి సస్పెండ్ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్ అపార్ట్‌మెంట్‌లో ఆదివారం సోదాలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. కూనతుర్మేడులోని ఆయన అపార్ట్‌మెంట్‌లో ఆధారాలు సేకరించేందుకు రెండు పోలీసు బృందాలు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నాయని అధికారులు తెలిపారు. గర్భవతిగా ఉన్న సమయంలో, గత మే చివరి వారంలో రెండు రోజులపాటు ఈ అపార్టుమెంట్‌లో తనపై అత్యాచారం జరిగినట్లు బాధితురాలు నవంబర్ 28న ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నది.
సీసీటీవీ ఫుటేజీ స్వాధీనం
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె నిజంగా ఆ అపార్టుమెంట్‌కు వచ్చినట్లు నిర్ధారించేందుకు అక్కడి సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలు పత్రాలను కూడా పరిశీలించారు. సోదాలు జరిగే సమయంలో ఎమ్మెల్యేకు సిబ్బంది అక్కడే ఉన్నారు. కేసు నమోదు అయిన శుక్రవారం నుంచి రాహుల్ మమ్‌కూటథిల్ కనిపించకుండా పోయారని పోలీసులు తెలిపారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరువనంతపురం జిల్లా ప్రధాన సెషన్స్ కోర్టులో దాఖలు చేయగా, అది బుధవారం విచారణకు రావాల్సి ఉంది. ఈ కేసులో మమ్‌కూటథిల్ స్నేహితుడు జోబీ జోసఫ్ కూడా సహ నిందితుడిగా ఉన్నాడు. అతడూ పరారీలోనే ఉన్నాడు. మే 30న బాధితురాలికి గర్భస్రావం జరగడానికి మాత్రలు ఇచ్చినట్లు ఇతనిపై ఉన్న ప్రధాన ఆరోపణ.బారతీయ న్యాయ సంహిత లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలు గర్భవతి అని తెలిసి కూడా అత్యాచారం చేయడం, హోదాను దుర్వినియోగం చేస్తూ అత్యాచారం, పదేపదే అత్యాచారం, అనుమతి లేకుండా గర్భస్రావానికి ప్రయత్నం, బెదిరింపులు, ఇతర ఆరోపణలు ఉన్నాయి. అదనంగా ఐటీ చట్టం 66(ఈ) ప్రకారం ప్రైవేట్ చిత్రాలను రికార్డ్ చేసి బెదిరించిన అంశంలో కూడా కేసు పెట్టారు. ఇదివరకే థర్డ్ పార్టీ ద్వారా పోలీసులకు పంపిన ఆడియో, చాట్ మెసేజెస్ ఆధారంగా క్రైమ్ బ్రాంచ్ ప్రాథమిక కేసు నమోదు చేసింది. తాజాగా మరో ఆడియో వెలుగు చూసింది. అందులో మొదట సంతానం కావాలని కోరినట్లు చెప్పి, తరువాత గర్భస్రావం చేయాలని ఒత్తిడి చేసినట్లు వినిపిస్తుంది.
మలయాళ నటి రిని ఆన్ జార్జ్ ఒక యువ నాయకుడు తనపై అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించిన తర్వాత ఆయన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు, దీంతో బిజెపి, సిపిఐ(ఎం) యువజన విభాగం డివైఎఫ్‌ఐ నిరసనలు వ్యక్తం చేశాయి. తదనంతరం అనేక మంది మహిళలు, ఓ ట్రాన్స్‌జెండర్ కూడా అతనిపై ఆరోపణలు చేశారు. ఆగస్టు 25న కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం నుంచి మమ్‌కూటథిల్ ను సస్పెండ్ చేసింది గత ఏడాది నవంబరులో పాలక్కాడ్ ఉపఎన్నికలో గెలిచి అసెంబ్లీకి వచ్చిన మమ్‌కూటథిల్ పై ఈ కేసు రాజకీయంగా కలకలం రేపింది.
