Let's talk: editor@tmv.in
కేరళలో రాహుల్‌గాంధీ ఎన్నికల హామీలపై విమర్శలు

కేరళలో రాహుల్‌గాంధీ ఎన్నికల హామీలపై విమర్శలు

Pinjari Chand
9 మార్చి, 2026

కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ కేరళలో ప్రకటించిన ఐదు ఎన్నికల హామీలపై కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్ ఇండియా(ఎం), బీజేపీ నేతలు ఆదివారం తీవ్ర విమర్శలు చేశారు. ఈ హామీలు అమలులోకి రావడం కష్టమని వారు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కేరళ పర్యటనలో భాగంగా మహిళలకు కేఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, కాలేజీ విద్యార్థినులకు నెలకు రూ.1,000, సంక్షేమ పెన్షన్‌ను నెలకు రూ.3,000కు పెంపు, ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల బీమా కవరేజ్, యువ పారిశ్రామికవేత్తలకు రూ.5 లక్షల వడ్డీ రహిత రుణాలు వంటి హామీలు ప్రకటించారు.

కేరళ ఆర్థిక మంత్రి కేఎన్‌.బాలాగోపాల్‌ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీలను ప్రజలు బాగా గుర్తుంచుకున్నారని అన్నారు. యూడీఎఫ్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సంక్షేమ పెన్షన్ కేవలం రూ.600 మాత్రమే ఉండేదని, 18 నెలల చెల్లింపులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. అదే సమయంలో కేఎస్‌ఆర్‌టీసీ పరిస్థితి కూడా దారుణంగా ఉండేదని చెప్పారు. ప్రస్తుతం పెన్షన్ల కోసం నెలకు సుమారు రూ.72 కోట్లు, ఉద్యోగుల జీతాల కోసం మరో రూ.50 కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ హామీలను ప్రజలు నమ్మరని, త్వరలో ఎల్‌డీఎఫ్ మేనిఫెస్టో విడుదల చేస్తామని బాలగోపాల్ తెలిపారు. కేంద్రం నిధులు తగ్గించినప్పటికీ కేరళ ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వం నిలబెట్టిందని అన్నారు. కేరళ పరిశ్రమల మంత్రి పీ.రాజీవ్‌ మాట్లాడుతూ, కాంగ్రెస్ హామీలు విన్న ప్రజలు యూడీఎఫ్ పాలనలోని పరిస్థితులను గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. అప్పట్లో కేఎస్‌ఆర్‌టీసీ మూతపడే స్థితికి చేరిందని ఆయన పేర్కొన్నారు. రవాణా మంత్రి కేబీ.గణేశ్‌కుమార్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు అమలైతే కేఎస్‌ఆర్‌టీసీ ఆర్థికంగా కూలిపోతుందని అన్నారు. కర్ణాటకలో కూడా ఇదే విధమైన పథకం అమలయ్యాక రవాణా సంస్థలు నష్టాల్లోకి వెళ్లాయని ఆయన ఆరోపించారు.

ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్‌ చంద్రశేఖర్‌‌ కాంగ్రెస్ హామీలను రాజకీయ నాటకంగా అభివర్ణించారు. ఎన్నికల ముందు పేదలకు పెద్ద పెద్ద హామీలు ఇచ్చి, ఎన్నికల తర్వాత వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ రాజకీయమని ఆయన విమర్శించారు. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు సంక్షేమ పథకాల హామీలతో అధికారంలోకి వచ్చాయని, కానీ ప్రస్తుతం ఆ రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు.