Let's talk: editor@tmv.in
కేరళలో మార్పు రావాలి.. యూడీఎఫ్ అభ్యర్థులను గెలిపించండి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కేరళలో మార్పు రావాలి.. యూడీఎఫ్ అభ్యర్థులను గెలిపించండి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Gaddamidi Naveen
5 ఏప్రిల్, 2026

కేరళ రాష్ట్రంలో సుపరిపాలన, సెక్యులర్ విలువలను పునరుద్ధరించాలంటే ఈ నెల 9న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యూనైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శనివారం పతనంతిట్ట అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై విమర్శలు

ప్రస్తుత ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని భట్టి విమర్శించారు. ఒకప్పుడు ఉన్నత విలువలకు ప్రతీకగా ఉన్న కేరళలో ఇప్పుడు మానవీయ విలువలు దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిజం పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గుండాయిజం వైపు మళ్లిందని, నిరుద్యోగం పెరగడం వల్ల యువత విదేశాలకు వలస వెళ్తున్నారని ఆయన ఆరోపించారు.

తెలంగాణ మోడల్ వివరణ

కాంగ్రెస్ పార్టీ మాత్రం సుపరిపాలన, శాంతి భద్రతలు, సెక్యులర్ విలువలకు కట్టుబడి ఉందని ఆయ‌న పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్నామని తెలిపారు. ఎవరికైనా సందేహం ఉంటే తెలంగాణకు వచ్చి పరిశీలించాలని ఆయ‌న సూచించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా కుటుంబాలపై వేల కోట్ల భారం తగ్గిందని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్రంలోని 1.06 కోట్ల కుటుంబాలకు నాణ్యమైన సన్నబియ్యం ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పేదలకు రూ.500 గ్యాస్ సిలిండర్, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం వివరించారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేసి భారీ నిధులను నేరుగా ఖాతాల్లో జమ చేశామని, గత రెండేళ్లలో 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు.

కేరళ కోసం యూడీఎఫ్ హామీలు

కేరళలో యూడీఎఫ్ అధికారంలోకి వస్తే విప్లవాత్మక మార్పులు తెస్తామని భట్టి హామీ ఇచ్చారు. కాలేజీకి వెళ్లే మహిళలకు నెలకు రూ. 1,000 ఆర్థిక సాయం, యువతకు వడ్డీ లేని రుణాలు, సామాజిక పెన్షన్ల పెంపు వంటి పథకాలను అమలు చేస్తామన్నారు. ముఖ్యంగా వృద్ధుల కోసం ఉమెన్ చాందీ పేరుతో ప్రత్యేక బీమా పథకాన్ని, వారి సంక్షేమం కోసం దేశంలోనే మొదటిసారిగా ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కేరళ ఉజ్వల భవిష్యత్తు కోసం హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.