
కేరళలో మతవాద శక్తులను అణచివేశాం: సీఎం విజయన్
గత పదేళ్లలో కేరళలో సామూహిక అల్లర్లు చోటుచేసుకోలేదని, ఎలాంటి మతవాద శక్తులనైనా ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం కఠినంగా ఎదుర్కోంటుందని, ఆ మత శక్తులను అణచివేశామని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ స్పష్టం చేశారు. శనివారం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన కేరళలో సామూహిక సమస్యలు లేకపోవడం అభివృద్ధికి దోహదపడింది. గత 10 ఏళ్లలో ఒక్క సామూహిక అల్లరి జరగలేదు. యూడీఎఫ్ పాలనలో అలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. మా ప్రభుత్వం ఏ రూపంలోని మత వాదానికీ మద్దతు ఇవ్వదు. ఎక్కడైనా సామూహిక ఘర్షణ తలెత్తితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
చిన్న కేరళ కాదు… గొప్ప కేరళ
రాష్ట్ర అభివృద్ధికి ఆత్మవిశ్వాసం, స్వావలంబన అవసరమని సీఎం విజయన్ పేర్కొన్నారు.మనకు కావలసింది చిన్న కేరళ అని చెప్పే న్యూనతా దృక్పథం కాదు, గొప్ప కేరళ అని చెప్పే ధైర్యం కావాలి. ఎవరి కరుణకూ ఎదురుచూడడం లేదు. మన బలంతో ముందుకు సాగుతున్నాం. ‘నవ కేరళ’ అసాధ్యం కాదు. సవాళ్లు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. దేశీయ ఉత్పత్తిని రెట్టింపు చేయాలి. అభివృద్ధి చెందిన దేశాల స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాలి. అదే రాబోయే వామపక్ష ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఒత్తిడి తెచ్చినప్పటికీ రాష్ట్రం అభివృద్ధి దిశలోనే ఉందని ఆయన పేర్కొన్నారు. మనం సరైన దారిలో ఉన్నాం. సాధించినదానితో సంతృప్తి చెందకూడదు. లక్ష్యాన్ని చేరుకోవడానికి మరింత వేగంగా ముందుకు సాగాలని సూచించారు.
పరిశ్రమలపై దృష్టి
2016 కి ముందు, కేరళ పరిశ్రమలకు అనుకూలమైన రాష్ట్రంగా మారుతుందని ఎవరైనా భావించారా? ఇది పరిశ్రమకు తగినది కాదనే సాధారణ అభిప్రాయం అందరిలో ఉండింది. ఇప్పుడు, అన్ని రంగాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ప్రతి పరిశ్రమ మనకు అనుకూలంగా ఉండదు. కేరళకు తగిన పరిశ్రమలను మాత్రమే మేం ప్రోత్సహిస్తున్నామని విజయన్ తెలిపారు.
వేడేక్కిన ఎన్నికల వాతావరణం
మే 2026 కు ముందు కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే అధికారిక షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు. 140 స్థానాల అసెంబ్లీలో ముక్కోణపు పోరు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్‌డీఎ మధ్య హైటెన్షన్ పోరు నెలకొనుంది. ప్రస్తుతం దాదాపు దశాబ్ద కాలంగా ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈసారి కూడా గద్దె నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది.
