
కేరళలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణకు కాంగ్రెస్ వ్యతిరేకం:ప్రియాంక గాంధీ
ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కేరళతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు. ఎన్నికల్లో మోసం చేయడానికే సర్ ను తీసుకొచ్చారు. మేం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఏవిధంగా చేపట్టారో మనం చూశాం. బీహార్‌లో ఎలా అమలు చేశారో అంతా చూశాం.. పార్లమెంట్‌లోనూ, బయటా దానికి వ్యతిరేకంగా పోరాడాం. ఇపుడు కూడా అలాగే పోరాడతాం అని ఆమె తెలిపారు.
ఇదే అంశంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఎన్నికల సంఘంపై మండిపడ్డారు. ఈ నిర్ణయం ప్రజాస్వామ్య ప్రక్రియకు ‘ప్రత్యక్ష సవాలు’ విసిరినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. 2002–2004 నాటి ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకుని సవరణ చేయడం చట్టవిరుద్ధమని, ప్రస్తుత జాబితానే ప్రామాణికమని రిప్రంజన్టేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1950, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోర్స్ రూల్స్ 1960 స్పష్టం చేస్తున్నాయని గుర్తు చేశారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఇప్పుడు ప్రత్యేక సవరణ అసాధ్యమని రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా చెప్పారని విజయన్ గుర్తు చేశారు.
దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రథన్ యు కెల్కర్ మాత్రం సర్ లక్ష్యం ఓటర్ల జాబితాను పూర్తిగా ప్రక్షాళన చేయడమే అని అన్నారు. ఎవరైనా రాజకీయ పార్టీకి అనుమానం ఉంటే, మాకు నేరుగా జాబితా ఇవ్వొచ్చు. అర్హుల పేర్లన్ని చేర్చేలా చూస్తాం అని ఆయన హామీ ఇచ్చారు. ఇటీవలే కేంద్ర ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా రెండో విడతగా ‘సర్’ను తొమ్మిది రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపడతామని ప్రకటించింది. దీంతో కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, యూబీటీ,ఎన్సీపీ, సీపీఐ తదితర పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ ప్రక్రియను రాజకీయ ఉద్దేశ్యంతో జరుగుతోందని భావిస్తున్నాయి. ప్రస్తుత జాబితా ప్రకారమే సవరణ చేపట్టాలని కోరుతున్నాయి. లేదా నిర్ణయం వాయిదా వేయమని కోరుతున్నాయి. కొన్ని పార్టీలకు లాభం చేకూర్చే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించొద్దని హితవు చెబుతున్నాయి.
