
కేరళలో నటిపై లైంగిక దాడి కేసులో నేడు తీర్పు
2017 ఫిబ్రవరి 17 రాత్రి కొచ్చిలో తన కారులో ప్రయాణిస్తున్న ఓ ప్రముఖ హీరోయిన్(తమిళ్, తెలుగు, మళయాల్లో చిత్రాల్లో నటించారు) ను కొందరు వ్యక్తులు బలవంతంగా కారులోకి చొరబడి, కిడ్నాప్ చేసి సుమారు రెండు గంటపాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను వదిలేసి పరారయ్యారు. అప్పట్లో ఈ దాడి మాలీవుడ్ ను కుదిపేసింది. దీంతో కేరళ ప్రభుత్వం హేమా కమిటీని 2017 జూలైలో ఏర్పాటు చేసింది. ఈ ఘటన తర్వాత ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (మే 2017లో ఏర్పడింది). సిఫార్సుతో కమిటీని నియమించింది. నటిపై దాడికి పాల్పడిన నిందితుల్లో ఇండస్ట్రీలోనే అతిపెద్ద నటుడైన దిలీప్ ఈ దారుణ ఘటనకు పాల్పడంతో సినిమా లోకం నివ్వెర పోయింది. అయితే సహనటిపై జరిగిన ఈ దాడిని పక్కా ప్రణాళికతో చేశాడా? ఇందులో కుట్ర కోణాలు దాగి ఉన్నాయా అన్న విషయాలతో కేరళలోని ఓ కోర్టు సోమవారం (డిసెంబర్ 8, 2025) తీర్పును వెల్లడించనుంది. దాదాపు ఎనిమిదేళ్లుగా ఎన్నో అసాధారణ మలుపులు, తీవ్రమైన అలస్యం, అనేక సినిమా ట్విస్ట్ లతో ఈ కేసు సాగుతూనే ఉంది.
ఎవరెవరు నిందితులు?
ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు
పల్సర్ సునీ (ముఖ్య నిందితుడు), మార్టిన్ ఆంటోనీ, మణికంఠన్, విజేష్, సలీం, ప్రదీప్, చార్లీ థామస్, నటుడు దిలీప్ (అసలు పేరు గోపాలకృష్ణన్),
మేస్త్రీ సనీల్ కుమార్, శరత్ ఉన్నారు. వీరిపై ఆయా ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. దిలీప్‌పై అదనంగా సెక్షన్ 204 (ఆధారాలు ధ్వంసం చేయడం) కూడా ఉంది.
దిలీప్ ను ఎలా గుర్తించారు?
ముఖ్య నిందితుడు సునీ జైలు నుంచి దిలీప్‌కు ఒక లేఖ రాశాడని పోలీసులు గుర్తించారు. 2017 జులై 10న దిలీప్‌ను అరెస్ట్ చేశారు. అక్టోబర్ 3న బెయిల్ వచ్చింది. దిలీప్ మాజీ భార్య మంజు వారియర్‌కు మరోనటితో ఆయనకు ఉన్న సంబంధం గురించి చెప్పడం, 2016లో ఓ స్టేజ్ ఈవెంట్ రిహార్సల్ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడం. ఇవన్నీ కుట్రకు కారణమని ప్రాసిక్యూషన్ వాదన.
కేసులో మలుపులు
కేసు లాగే విచారణ కూడా అనేక మలుపులు తిరిగింది. 2019లో దిలీప్ సీబీఐ దర్యాప్తు కోరుతూ కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. కానీ ఆ పిటిషన్ కొట్టివేసింది. 2019లో సుప్రీంకోర్టు ఆరు నెలల వ్యవధిలో విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది.
అయితే నిందితులు, ప్రాసిక్యూషన్, ఫిర్యాదుదారులు తరచుగా ఉన్నత న్యాయస్థానాలలో పిటిషన్లు దాఖలు చేయడం వలన విచారణ ఆలస్యమైంది. చివరికి విచారణ జనవరి 2020లో ప్రారంభమైంది. అలాగే కోవిడ్-19 మహమ్మారి కూడా విచారణ నిలిచిపోవడానికి కారణమైంది. తరువాత స్పెషల్ ప్రాసిక్యూటర్ ఎ సురేశన్ రాజీనామా చేయగా, విచారణను వేరే కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ప్రాసిక్యూషన్ డిసెంబర్ 2020లో ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించింది. డిసెంబర్ 29, 2021న దర్యాప్తు అధికారిని చివరి సాక్షిగా విచారించాల్సి ఉన్నప్పుడు, ఈ కేసులో మరింత సమాచారం బయటకు వచ్చిందని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలియజేసి, తదుపరి దర్యాప్తు కోరింది. దీంతో విచారణను మళ్లీ నిలిపివేసింది.
బాధితురాలి దృశ్యాలు దిలీప్ వద్ద ఉన్నాయని సినీ దర్శకుడు బి బాలచంద్ర కుమార్ వెల్లడించిన వివరాల ఆధారంగా తదుపరి దర్యాప్తు జరిగింది. దర్యాప్తు అధికారులకు హాని కలిగించడానికి దిలీప్ కుట్ర పన్నాడని మరొక ఆరోపణ, దీని ఫలితంగా అతనిపై మరో ఐదుగురిపై మరో కేసు నమోదైంది. విచారణ తిరిగి ప్రారంభించినప్పుడు వీఎన్ అనిల్‌కుమార్‌ను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించారు. ఆయన డిసెంబర్ 2021లో రాజీనామా చేసి, అతని స్థానంలో మరో పీపీ నియమితులయ్యారు. 2022లో కోర్టు కస్టడీలో ఉంచిన మెమరీ కార్డును అక్రమంగా యాక్సెస్ చేయడంపై దర్యాప్తు కోరుతూ పోలీసులు ట్రయల్ కోర్టును ఆశ్రయించినప్పుడు మరో ప్రధాన మలుపు తిరిగింది. మొత్తం 261 మంది సాక్షులను విచారించారు. చాలా మంది సినీ ప్రముఖులు సాక్ష్యాలను తారుమారు చేశారు. కీలక సాక్షులైన మాజీ ఎమ్మెల్యే పి.టి. థామస్, దర్శకుడు బాలచంద్రకుమార్ విచారణ సమయంలోనే మరణించారు.
చివరగా 2020 జనవరి నుంచి ప్రారంభమైన ట్రయల్ దాదాపు ఆరేళ్ల తర్వాత ముగిసింది. 834 డాక్యుమెంట్లు, ఇద్దరు డిఫెన్స్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. మా వద్ద ఉన్న అన్ని ఆధారాలనూ కోర్టు ముందుంచాం. తీర్పుపై ఎంతో ఆశతో ఉన్నామని దర్యాప్తు బృందంలోని ఒక అధికారి మీడియాతో చెప్పారు. సోమవారం ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు జడ్జి హనీ, ఎం వర్గీస్ తీర్పు వెలువరించనున్నారు.
