Let's talk: editor@tmv.in
కేరళలో గర్భిణి హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష

కేరళలో గర్భిణి హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష

Pinjari Chand
25 నవంబర్, 2025

కేరళలో షాక్‌కు గురిచేసిన గర్భిణి హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రబీస్‌ (36) కు ఆలప్పుజ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు సోమవారం ఉరిశిక్ష విధించింది. 2021 జూలై 9న ఆలప్పుజ జిల్లా కైనాకరి ప్రాంతంలో పున్నప్రాకు చెందిన అనిత శశిధరణ్‌ (32)ను హత్య చేసిన కేసులో ఈ తీర్పు వెలువడింది. నేర నిరూపణకు పోలీసులు మొత్తం 82 మంది సాక్షులు, 131 డాక్యుమెంట్లు, 53 మెటీరియల్ ఆబ్జెక్టులు కోర్టులో ప్రవేశపెట్టారు.

ప్రబీస్ కు ఉరి – భారీ జరిమానా

అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి సుహైబ్ ఎం ముందస్తు విచారణలన్నీ పూర్తి చేసి ఐపీసీ 302 (హత్య) కింద ఉరిశిక్షతో పాటు రూ.లక్ష జరిమానా, ఐపీసీ 120బీ (కుట్ర) కింద జీవిత ఖైదుతో పాటు రూ.లక్ష , ఐపీసీ 201 (సాక్ష్యాలు నశింపజేయడం) కింద 5 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.50,000 జరిమానా విధించారు. కోర్టు ఈ కేసును ‘రేర్‌ఆఫ్‌ ద రేర్‌’ కేటగిరీకి చెందినదని వ్యాఖ్యానించింది.

మరో నిందితురాలు రజనీ శిక్ష పెండింగ్

ఈ కేసులో రెండో నిందితురాలైన రజనీ (38) దోషిగా తేలినా, ఆమె ప్రస్తుతం ఒడిశాలోని ఓ జైల్లో మాదకద్రవ్య కేసులో రిమాండ్‌లో ఉండటంతో శిక్షను వెలువరించలేదు. ఆమెను విడుదల చేయాలని కోర్టు వారెంట్ జారీ చేసింది. విచారణ అనంతరం శిక్ష ఖరారు చేయనుంది.

గర్భంలోని 5 నెలల శిశువు ప్రాణాలు పోయాయి

తీర్పులో కోర్టు భావోద్వేగ వ్యాఖ్యలు చేసింది. నిందితుల చర్య రెండు ప్రాణాలను కడతేర్చింది. అనితతో పాటు ఆమె గర్భంలోని అయిదు నెలల శిశువు కూడా చనిపోయాడు అని పేర్కొంది.

హత్య వివరాలు పోలీసుల ప్రకారం

ప్రబీస్ అనితతో పాటు రజనీతోనూ సంబంధం కొనసాగించాడు. అనిత గర్భవతి కావడంతో గర్భం తొలగించాలని ఆమెను ఒత్తిడి చేశాడు. అనిత అంగీకరించకపోవడంతో జూలై 9న రజనీ ఇంటికి పిలిపించి ఇద్దరూ కలిసి ఆమెను శ్వాస ఆడకుండా చేసి హతమార్చారు. అనంతరం శవాన్ని పుకైతా నదిలో పడేశారు. అయితే ఆ మరుసటి రోజు అనిత శవం నదిలో తేలుతూ కనిపించింది. తీర్పు అనంతరం ప్రబీస్‌ను కన్నూర్ సెంట్రల్‌ జైలుకు తరలించారు. జరిమానా మొత్తాన్ని అనిత తండ్రి, పిల్లలకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. బాధిత కుటుంబానికి కేరళ విక్టిమ్ కంపెన్సేషన్ స్కీం కింద నష్టపరిహారం అందేలా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చర్యలు తీసుకోవాలని సూచించింది.

కేరళలో గర్భిణి హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష - Tholi Paluku