Let's talk: editor@tmv.in
కేరళలో ఐదేళ్ల చిన్నారిపై పెంపుడు తల్లి పైశాచికం

కేరళలో ఐదేళ్ల చిన్నారిపై పెంపుడు తల్లి పైశాచికం

Dantu Vijaya Lakshmi Prasanna
10 జనవరి, 2026

కేరళలో మానవత్వం మంటగలిసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పక్కలో మూత్రం పోసిందన్న నెపంతో ఐదేళ్ల పసిపాపపై ఆమె పెంపుడు తల్లి అత్యంత క్రూరంగా ప్రవర్తించింది. నిప్పుపై వేడి చేసిన స్టీల్ గరిటెతో బాలిక మర్మాంగాలపై వాతలు పెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

కంజీకోడ్ సమీపంలో నివసిస్తున్న ఓ నేపాలీ కుటుంబంలో ఈ ఘటన జరిగింది. పాప అంగన్‌వాడీకి వెళ్లిన సమయంలో కూర్చోవడానికి ఇబ్బంది పడటం గమనించిన టీచర్, అనుమానంతో పరిశీలించగా ఈ ఘోరం బయటపడింది. వెంటనే టీచర్ పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు బీహార్‌కు చెందిన సదరు మహిళను అరెస్ట్ చేసి, భారతీయ న్యాయ సంహిత, జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితురాలు 14 రోజుల రిమాండ్‌లో ఉండగా, చిన్నారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సంరక్షణకు తరలించారు.

ఈ సంఘటనలో బాధితురాలు ఐదేళ్ల చిన్నారి. పాప తండ్రి నేపాల్‌కు చెందిన వ్యక్తి, స్థానిక హోటల్‌లో పనిచేస్తున్నారు. చిన్నారి పెంపుడు తల్లి బీహార్‌కు చెందిన మహిళ. టీచర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందితురాలిని గురువారం అరెస్ట్ చేశారు.

ఈ కేసులో నిందితురాలిపై ప్రయోగించిన ప్రధాన చట్టం జువెనైల్ జస్టిస్ యాక్ట్. దీని గురించి క్ పరిశీలిస్తే, సెక్షన్ 75 జువెనైల్ జస్టిస్ యాక్ట్ పిల్లలను శారీరకంగా హింసించడం, గాయపరచడం లేదా వారి పట్ల క్రూరంగా ప్రవర్తించడం వంటి చర్యలకు ఈ సెక్షన్ కింద కఠిన శిక్షలు ఉంటాయి. తల్లిదండ్రుల నుండి ముప్పు ఉన్నప్పుడు లేదా పిల్లలు హింసకు గురైనప్పుడు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి పూర్తి బాధ్యత తీసుకుంటుంది.

ఈ ఘటనలో అంగన్‌వాడీ టీచర్ సమయస్ఫూర్తి అభినందనీయం. పిల్లల ప్రవర్తనలో లేదా శరీరంలో ఏవైనా మార్పులు గమనిస్తే వెంటనే స్పందించడం వల్ల ఇలాంటి దారుణాలను అరికట్టవచ్చని ఈ ఘటన నిరూపిస్తోంది.

పిల్లలపై జరిగే అరాచకాలను అరికట్టడానికి వారి హక్కులను రక్షించడానికి భారత రాజ్యాంగంలో అలాగే జువెనైల్ జస్టిస్ యాక్ట్, 2015లో కఠినమైన నిబంధనలను పొందుపరిచింది.

జువెనైల్ జస్టిస్ యాక్ట్ లోని కీలక సెక్షన్లు:

సెక్షన్ 75 (పిల్లల పట్ల క్రూరత్వం):

ఈ సెక్షన్ ప్రకారం, పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తి వారిని కొట్టినా, హింసించినా లేదా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసినా అది నేరం. దీనికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు రూ. 1 లక్ష వరకు జరిమానా పడవచ్చు. ఒకవేళ ఆ హింస వల్ల శిశువుకు శారీరక లేదా మానసిక వైకల్యం కలిగితే శిక్ష 10 ఏళ్ల వరకు పెరుగుతుంది.

సెక్షన్ 82 (శారీరక దండన):

పాఠశాలల్లో లేదా సంరక్షణ కేంద్రాల్లో పిల్లలను క్రమశిక్షణ పేరుతో శారీరకంగా దండించడం నేరం. మొదటిసారి ఈ నేరానికి పాల్పడితే రూ. 10,000 జరిమానా, రెండోసారి అయితే జైలు శిక్ష ఉంటుంది.

సెక్షన్ 30 & 37 (పునరావాసం):

హింసకు గురైన పిల్లలను వెంటనే రక్షించి, వారికి అవసరమైన వైద్యం, కౌన్సెలింగ్ మరియు ఆశ్రయం కల్పించే బాధ్యతను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగిస్తుంది.

భారత రాజ్యాంగం కల్పించిన పిల్లల హక్కులు:

ఆర్టికల్ 21 (జీవించే హక్కు) దీని ప్రకారం, ప్రతి బిడ్డ గౌరవంగా సురక్షితంగా జీవించే హక్కును కలిగి ఉంటారు.

ఆర్టికల్ 24 ప్రకారం, 14 ఏళ్లలోపు పిల్లలను ప్రమాదకరమైన పనుల్లో (హోటళ్లు, ఫ్యాక్టరీలు) ఉంచడం నిషేధం.

ఆర్టికల్ 39 (f) ప్రకారం, పిల్లలు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎదగడానికి, దోపిడీకి గురికాకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత.

పోక్సో చట్టం:

ఒకవేళ హింస లైంగిక కోణంలో లేదా ప్రైవేట్ భాగాలపై తీవ్రమైన గాయాలు చేసే ఉద్దేశంతో ఉంటే, పోక్సో చట్టం కింద కూడా కేసులు నమోదు చేస్తారు. ఇందులో బెయిల్ రావడం చాలా కష్టం, శిక్షలు అత్యంత కఠినంగా ఉంటాయి.

ముఖ్య గమనిక - ఎక్కడైనా ఇలాంటి బాల్య హింస జరుగుతున్నట్లు మీకు తెలిస్తే, వెంటనే 1098 కి కాల్ చేయవచ్చు. ఇది 24 గంటలు పనిచేసే ఉచిత హెల్ప్‌లైన్ నంబర్.