
కేరళలో ఏఐ వీడియో వివాదం.. ‘ఎక్స్’పై కేసు నమోదు
ప్రధాని నరేంద్రమోడీ, భారత ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించేలా, పరువు నష్టం కలిగించేలా చూపిస్తూ రూపొందించిన ఏఐ వీడియో ప్రచారం చేసిన కేసులో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్ కార్ప్’పై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. కేరళ పోలీసుల సైబర్ విభాగం ఈ చర్య తీసుకుంది. ఈ వీడియోపై అధికారిక మార్గాల ద్వారా, ముఖ్యంగా ఈసీఐ నుంచి ఫిర్యాదు అందినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల ప్రకటన ప్రకారం, వీడియో ప్రజలను తప్పుదారి పట్టించే అవకాశం ఉందని, రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీయడమే కాకుండా, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో తిరువనంతపురం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఎక్స్ అకౌంట్ ‘లక్ష్మి ఎన్ రాజు’, ఇతరులతో పాటు ఎక్స్ కార్ప్‌పై బుధవారం రాత్రి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధ్యత ఎవరిది అన్నదానిపై విచారణ ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్ ప్రకారం, 1 నిమిషం 17 సెకన్ల వీడియోను సమాజంలో అల్లర్లు రేపే ఉద్దేశంతో పోస్టు చేసినట్లు పేర్కొన్నారు. సంబంధిత కంటెంట్‌ను తొలగించాలని అధికారుల సూచనలు ఉన్నప్పటికీ, ఎక్స్ ప్లాట్‌ఫామ్ దానిని అలాగే కొనసాగనిచ్చిందని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
ఈ నేపథ్యంలో ఐటీ చట్టం, సంబంధిత నిబంధనల ప్రకారం, అనధికారిక కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని ఎక్స్‌కు నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, తదితర వర్తించే చట్టాల ప్రకారం, వీడియో మరింతగా వ్యాపించకుండా కేరళ పోలీసుల సైబర్ విభాగం వెంటనే చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అసత్య, తప్పుదారి పట్టించే కంటెంట్‌ను సృష్టించడం, పంచుకోవడం, విస్తరించడం నుంచి ప్రజలు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలను ప్రభావితం చేసే ఎలాంటి చర్యలపై అయినా చట్టపరంగా, త్వరితగతిన, నిష్పాక్షికంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
