
కేరళలో ఎల్‌డీఎఫ్-యూడీఎఫ్ పోరాటం ఒక డ్రామా: ఎన్. రామచందర్ రావు
తెలంగాణ, కేరళ ముఖ్యమంత్రుల మధ్య సాగుతున్న మాటల యుద్ధం రాజకీయంగా వేడిని పెంచుతోంది. 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ మధ్య జరుగుతున్న ఈ ఘర్షణను కేవలం 'షాడో బాక్సింగ్' మాత్రమేనని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు బుధవారం విమర్శించారు. కేరళలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకమిదని ఆయన అభివర్ణించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీలైన సీపీఐ, సీపీఐ(ఎం)తో కలిసి పనిచేస్తోందని గుర్తు చేశారు. అయితే కేరళలో మాత్రం అదే పార్టీలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకోవడం రాజకీయ వ్యూహంలో భాగమేనని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళలో ప్రచారం చేస్తూ బీజేపీపై ఆరోపణలు చేయడం, ఎల్‌డీఎఫ్ తో బీజేపీకి అండర్‌స్టాండింగ్ ఉందన్నట్లు మాట్లాడటం వాస్తవానికి విరుద్ధమని రామచంద్రరావు విమర్శించారు. తెలంగాణలో దోస్తులుగా ఉండి, కేరళలో శత్రువుల్లా నటిస్తున్న రేవంత్ రెడ్డి, విజయన్‌ల తీరును ప్రజలు గమనిస్తున్నారని రామచందర్ రావు ఈ సందర్భంగా విమర్శించారు.
ఈ వివాదానికి ఆరంభం ఏప్రిల్ 3న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో జరిగింది. కేరళలో చీకటి యుగం ముగిసి, యూడీఎఫ్ ఆధ్వర్యంలో స్వర్ణయుగం ప్రారంభమవుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఏప్రిల్ 4న తీవ్రంగా స్పందిస్తూ, ఆ వ్యాఖ్యలు అవమానకరమని, ఆధారరహితమని అన్నారు. తెలంగాణలో పేదరికం, అక్షరాస్యత వంటి సమస్యలపై దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డికి సూచించారు.
దీనికి ప్రతిగా రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును సమర్థిస్తూ, నీతి ఆయోగ్ ఎస్డీజీ ఇండెక్స్ 2023-24 గత ప్రభుత్వాల పాలన ప్రతిఫలమని పేర్కొన్నారు. అనంతరం ఈ మాటల యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. పినరాయి విజయన్ రాజకీయ కాలం ముగిసిందని, ఆయనను ప్రధాని నరేంద్ర మోడీ రక్షిస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. విజయన్ మంగళవారం ఒక మలయాళ సినిమా డైలాగ్ 'పో మోనే దినేశాను ఉపయోగిస్తూ వ్యంగ్యంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు ఇద్దరి మధ్య వివాదాన్ని మరింత వేడెక్కించాయి.
కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. వరుసగా మూడోసారి గెలిచి చరిత్ర సృష్టించాలని పినరయి విజయన్ భావిస్తుండగా, అధికార వ్యతిరేకత తమను గెలిపిస్తుందని కాంగ్రెస్ ఆశిస్తోంది. మే 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
