
కేరళలో ఎల్డీఎఫ్-యూడీఎఫ్ పాలనకు ముగింపు పలకాలి: ప్రధాని మోడీ
కేరళలో ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న ఎల్‌డీఎఫ్-యూడీఎఫ్ మార్పిడి పాలనకు ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బుధవారం నిర్వహించిన ఎన్డీయే మహా ర్యాలీలో ప్రసంగిస్తూ కాంగ్రెస్, వామపక్షాలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పై మోడీ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ‘యువరాజ్’ దేశంలో జరుగుతున్న అభివృద్ధి గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. భారత యువత డ్రోన్ తయారీలో అద్భుతాలు సృష్టిస్తున్నారని, దేశంలో అనేక కంపెనీలు డ్రోన్లు తయారు చేస్తున్నాయని చెప్పారు. కేరళ యువత కూడా డ్రోన్ స్టార్టప్‌లను స్థాపిస్తున్నారని పేర్కొన్నారు. అయితే రాహుల్ గాంధీ ఈ వాస్తవాలను గుర్తించకుండా భారత్ డ్రోన్ రంగంలో వెనుకబడి ఉందని చెప్పడం తప్పని అన్నారు.
కేరళ రాజకీయాలపై విమర్శ
కేరళలో ఎప్పటినుంచో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్స్కిస్ట్) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వాలు మారుతూ వస్తున్నాయని ఆయన అన్నారు. ఈ మార్పిడి పాలన రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారిందని విమర్శించారు. ఈ రెండు కూటములు అవినీతి, మతపరమైన రాజకీయాలు, పరిశ్రమల అభివృద్ధికి అడ్డంకులు సృష్టించడంలో భాగస్వాములని ఆయన ఆరోపించారు.
శబరిమల బంగారం వివాదం
శబరిమల ఆలయంలో బంగారం మాయం అయిన అంశాన్ని కూడా మోడీ ప్రస్తావించారు. ఎల్‌డీఎఫ్ నాయకులు ఆలయ బంగారం దోచుకున్నారని, యూడీఎఫ్ దాన్ని అమ్మిందనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో రెండు కూటములు ‘నేర భాగస్వాములు’ అని విమర్శించారు.
పశ్చిమ ఆసియా సంక్షోభం
పశ్చిమ ఆసియాలో జరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం పూర్తి శ్రద్ధ పెట్టిందని మోడీ చెప్పారు. భారత రాయబార కార్యాలయాలు 24 గంటలూ సహాయం అందిస్తున్నాయని తెలిపారు. ఈ సమయంలో కూడా కాంగ్రెస్, వామపక్షాలు అపోహలు సృష్టించి రాజకీయ లాభం పొందాలని ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజలు అలాంటి వదంతులను నమ్మవద్దని సూచించారు. కేరళలో కీలక ఓటు బ్యాంక్‌గా ఉన్న క్రైస్తవ సమాజాన్ని ఆకర్షించే ప్రయత్నంలో, యెమెన్, అఫ్గానిస్తాన్‌లలో చిక్కుకున్న ఇద్దరు పాద్రిలను భారత్ విజయవంతంగా రక్షించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఆత్మనిర్భర్ భారత్ అవసరం
పశ్చిమ ఆసియా సంక్షోభం మరోసారి ఆత్మనిర్భర్ భారత్ అవసరాన్ని చూపిందని అన్నారు. విదేశీ ఇంధనంపై ఆధారాన్ని తగ్గించేందుకు సౌర శక్తి సామర్థ్యాన్ని పెంచుతున్నామని తెలిపారు. కేరళలో కూడా సోలార్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని చెప్పారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, రైల్వేలను 100 శాతం విద్యుదీకరించడం వంటి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కేరళలో ప్రజలు ఎల్‌డీఎఫ్-యూడీఎఫ్ అనైతిక కూటమి నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నారని అన్నారు. బీజేపీ 2024లో త్రిశూర్ లోక్‌సభ స్థానాన్ని గెలుచుకోవడం, 2025లో తిరువనంతపురం కార్పొరేషన్‌తో పాటు కొన్ని స్థానిక సంస్థల్లో విజయం సాధించడం ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. ప్రకృతి, సంస్కృతి, ప్రతిభ, సాంకేతికత, సముద్ర వనరులు ఉన్నప్పటికీ కేరళలో అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని అన్నారు. వచ్చే ఐదేళ్లు బీజేపీ-ఎన్డీయేకు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని మోడీగ్యారంటీతో ప్రజలకు హామీ ఇచ్చారు.
ఆత్మనిర్భర్ భారత్‌కు పెట్రోలియం రంగ విస్తరణ కీలకం
దేశాన్ని స్వావలంబన దిశగా తీసుకెళ్లాలంటే పెట్రోలియం రంగ విస్తరణ చాలా అవసరమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కేరళలో రూ.10,800 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, కొన్ని ప్రాజెక్టులను దేశానికి అంకితం చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా భారత్ పెట్రోలియం కార్పోరేషన్‌కు చెందిన కొచ్చి రిఫైనరీలో నిర్మించిన పాలీప్రొపిలీన్ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు విలువ రూ.5,500 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. కేరళలో పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించే దిశగా పశ్చిమ కల్లడ, కొల్లాం జిల్లాలో 50 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్‌కు మోడీ శంకుస్థాపన చేశారు. భారత్ ఇప్పటికే సౌరశక్తి ఉత్పత్తిలో ప్రపంచంలోని అగ్రదేశాల్లో ఒకటిగా నిలిచిందని ఆయన తెలిపారు. కేరళ కూడా ఈ రంగంలో ముందుకు సాగాలని కేంద్రం ప్రయత్నిస్తున్నదన్నారు.
రైల్వే ప్రాజెక్టులు
రూ.10,800 కోట్ల ప్రాజెక్టులలో భాగంగా షోరనూర్–నిలంబూర్ రోడ్డు రైల్వే లైన్ విద్యుదీకరణ ప్రాజెక్టును కూడా ప్రధాని దేశానికి అంకితం చేశారు. ఈ విద్యుదీకరణ వల్ల రైళ్ల వేగం పెరగడమే కాకుండా ప్రయాణం మరింత సమర్థవంతంగా, పర్యావరణహితంగా మారుతుందని అధికారులు తెలిపారు. అదనంగా పాలక్కాడ్– పొల్లాచ్చి మధ్య కొత్త రైలు సేవను కూడా ప్రారంభించారు. ఈ సేవ కేరళ, తమిళనాడు రాష్ట్రాల మధ్య ప్రయాణించే ఉద్యోగులు, యాత్రికులు, వ్యాపారులు, పర్యాటకులకు ఉపయోగపడనుంది.
