Let's talk: editor@tmv.in
కేరళలో ఎక్కడైనా.. ఎప్పుడైనా చర్చకు సిద్ధం: మంత్రి శివన్‌కుట్టి

కేరళలో ఎక్కడైనా.. ఎప్పుడైనా చర్చకు సిద్ధం: మంత్రి శివన్‌కుట్టి

Pinjari Chand
29 మార్చి, 2026

కేరళ ఎన్నికల్లో బీజేపీ, అధికార ఎల్డీఎఫ్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నేమోం నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, నేమోం అభ్యర్థి చంద్రశేఖర్ ఆరోపించారు. అలాగే దీనిపై చర్చకు రావాలని రాష్​ట్రమంత్రికి, నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే శివన్‌కుట్టికి సవాల్‌ విసిరారు. దీంతో తన ప్రత్యర్థి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్‌ చంద్రశేఖర్‌‌ అభివృద్ధిపై ఓపెన్ డిబేట్‌కు తేదీ, స్థలాన్ని స్వయంగా నిర్ణయించుకోవచ్చని కేరళ మంత్రి, నేమోం నియోజకవర్గం ఎల్డీఎఫ్ అభ్యర్థి వి.శివన్‌కుట్టి శనివారం ప్రతి సవాల్‌ విసిరారు. ఇంతకుముందు చంద్రశేఖర్‌ పబ్లిక్ డిబేట్‌కు సవాల్ విసరగా, దానికి శివన్‌కుట్టి అంగీకరించి, మార్చి 29న పూజాపురంలో నిర్వహిద్దామని ప్రతిపాదించారు. అయితే అదే రోజు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ త్రిస్సూర్, పాలక్కాడ్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న నేపథ్యంలో, చంద్‌రశేఖర్ ఈ ప్రతిపాదనపై స్పందించలేదని తెలిపారు. ఇక్కడ జరిగిన అభివృద్ధిని చూసి ఆయన వెనక్కి తగ్గారని శివన్‌కుట్టి మీడియాతో అన్నారు.

సాయంత్రం వేళ చర్చిద్దాం

చంద్రశేఖర్ ప్రధానమంత్రి కార్యక్రమాల్లో బిజీగా ఉండవచ్చని తాను అర్థం చేసుకుంటున్నానని, అయినప్పటికీ డిబేట్‌కు ఏ తేదీ, ఏ ప్రదేశం నిర్ణయించినా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే ప్రచార కార్యక్రమాల వల్ల పగలు బిజీగా ఉండే కారణంగా, డిబేట్ సాయంత్రం వేళ జరగాలని ఒక షరతు పెట్టారు. నేమోంలో, అలాగే కేరళలో జరిగిన అభివృద్ధిని చంద్రశేఖర్ అర్థం చేసుకోలేదని ఆయన విమర్శించారు. ఇక్కడ అభివృద్ధి జరగలేదని బీజేపీ కార్యకర్తలే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. చంద్రశేఖర్ అభివృద్ధిని అంగీకరించాలని అన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో కేరళకు, నేమోంకు తాను ఏం చేయలేకపోయానని చంద్రఖర్ స్వయంగా ఒప్పుకున్నారని కూడా శివన్‌కుట్టి ఆరోపించారు. ఇక నేమోంలో రైల్వే అభివృద్ధి జరగకపోవడంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నియోజకవర్గంలో ప్రధాన పోటీ సీపీఐ(ఎం), బీజేపీ మధ్యనే ఉందని, అయితే గతంలో ఒక్కసారి మినహా ఎక్కువగా ఎల్డీఎఫ్‌కే ప్రజలు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. అభ్యర్థిగా అన్ని వర్గాల ప్రజల నుంచి ఓట్లు కోరనున్నట్లు శివన్‌కుట్టి చెప్పారు. గత ఐదేళ్లలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులపై వివరాలతో ఒక బ్రోచర్ తయారు చేసి ప్రతి ఇంటికీ పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. నేమోం నియోజకవర్గంలో ఈసారి గట్టి పోటీ నెలకొననుంది. శివన్‌కుట్టికి వ్యతిరేకంగా చంద్‌రశేఖర్ పోటీ చేయగా, కాంగ్రెస్ తరఫున కేఎస్‌ శబరినాథన్‌ బరిలో ఉన్నారు. 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీకి ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనున్నాయి.

కేరళలో ఎక్కడైనా.. ఎప్పుడైనా చర్చకు సిద్ధం: మంత్రి శివన్‌కుట్టి - Tholi Paluku