Let's talk: editor@tmv.in
కేరళలో ఈసీ లేఖపై ‘బీజేపీ సీల్‌’..అధికారి సస్పెన్షన్

కేరళలో ఈసీ లేఖపై ‘బీజేపీ సీల్‌’..అధికారి సస్పెన్షన్

Pinjari Chand
25 మార్చి, 2026

కేరళ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డా. రతన్‌ యూ.కెల్కర్‌‌ కార్యాలయం నుంచి సోమవారం ఓ రాజకీయ పార్టీ ముద్ర ఉన్న లేఖ వెళ్లిన ఘటనపై రాజకీయ వివాదం చెలరేగిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఈ ఘటనను తీవ్రమైన లోపంగా అభివర్ణిస్తూ అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన డా. కెల్కర్, ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు, మీడియాకు వివరణ ఇచ్చినట్లు తెలిపారు. మార్చి 19న భారతీయ జనతా పార్టీ ఒక మార్గదర్శకానికి సంబంధించి స్పష్టత కోరింది. అయితే 2019 మార్గదర్శక పత్రంపై ఆ పార్టీ ముద్ర ఉంది. మా సిబ్బంది ఫైల్‌ను ప్రాసెస్ చేసే సమయంలో అది గమనించలేదు. ఇది తీవ్రమైన లోపంగా భావిస్తున్నామని చెప్పారు. అసలు పంపాల్సిన అధికారిక మార్గదర్శక పత్రం మిస్‌ అయ్యింది. పార్టీ ముద్ర ఉన్న కాపీనే ఇతర పార్టీలకు వెళ్లిందని ఆయన వివరించారు. ఈ విషయం తెలిసిన వెంటనే మార్చి 21న ఆ లేఖను వెనక్కి తీసుకుని, సరైన మార్గదర్శకాలతో కొత్త లేఖను పంపినట్లు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యుడైన అధికారిపై కఠిన చర్యలు తీసుకున్నామని, సంబంధిత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌ను తక్షణమే సస్పెండ్ చేసినట్లు చెప్పారు. అలాగే ఘటనపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని విచారణను ఆదేశించినట్లు తెలిపారు.

సోమవారం కూడా ఈ అంశంపై స్పందించిన సీఈఓ కార్యాలయం, ఇది ఒక క్లెరికల్ ఎర్రర్ కారణంగా జరిగిందని తెలిపింది. బీజేపీ సమర్పించిన 2019 మార్గదర్శక కాపీని సిబ్బంది పొరపాటున ఇతర పార్టీలకు పంపారని వెల్లడించింది. ఆ మార్గదర్శకాలు అభ్యర్థుల క్రిమినల్ నేపథ్య వివరాల ప్రచురణకు సంబంధించినవని, అవి అప్పటి నుంచి సవరణలు పొందినట్లు పేర్కొంది. తాజా మార్గదర్శకాలను ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేసినట్లు స్పష్టం చేసింది. లోపం గుర్తించిన వెంటనే చర్యలు తీసుకుని, తప్పుగా పంపిన పత్రాన్ని వెనక్కు తీసుకున్నామని, డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మార్చి 21న అధికారికంగా లేఖ జారీ చేసినట్లు వెల్లడించింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని సీఈఓ కార్యాలయం తెలిపింది.

బీజేపీ ముద్రతో అసలు విషయం బయటపడింది: మమత ఆరోపణలు

ఎన్నికల కమిషన్ లేఖపై బీజేపీ ముద్ర కనిపించిన వివాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనతో ఎన్నికల కమిషన్‌ను వెనుక నుంచి ఎవరు నడిపిస్తున్నారో స్పష్టమైందని వ్యాఖ్యానించారు. సోమవారం ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన ఒక లేఖపై కేరళ బీజేపీ యూనిట్ ముద్ర కనిపించడం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ బీజేపీ రబ్బర్ స్టాంప్‌తో ఇప్పుడు అసలు విషయం బయటపడింది. ‘ది క్యాట్ ఈజ్ ఔట్ ఆఫ్ ది బ్యాగ్’, అని మమతా బెనర్జీ కొల్‌కత్తా విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఉత్తర బెంగాల్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు ఆమె బాగ్‌డోగ్రాకు వెళ్లే ముందు ఈ వ్యాఖ్యలు చేశారు. తన ఆరోపణలకు మద్దతుగా ఒక పత్రికా కథనాన్ని కూడా ఆమె చూపించారు. ఇది సాధారణ క్లెరికల్ తప్పిదం కాదు, రాజకీయ కుట్ర అని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ దీనిని మానవ తప్పిదంగా పేర్కొన్నదాన్ని ఆమె ఖండించారు.

ఈ ఘటనతో ఎన్నికల నిర్వహణలో కమిషన్ నిష్పక్షపాతంపై తీవ్రమైన సందేహాలు తలెత్తుతున్నాయని అన్నారు. దేశంలో ఒకే పార్టీ పాలనను రుద్దే ప్రయత్నానికి ఎన్నికల కమిషన్ సహకరిస్తోందని ఆరోపిస్తూ, అన్ని ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. వామపక్షాలు గానీ, రైటిస్ట్ గానీ ఏ సిద్ధాంతానికి చెందినవైనా సరే, అన్ని ప్రతిపక్షాలు కలిసి ఈ పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, స్వేచ్ఛా, నిష్పక్షపాత ఎన్నికలు జరిగేలా చూడాలని మమతా బెనర్జీ అన్నారు.