Let's talk: editor@tmv.in
కేరళలో ‘అమీబిక్ ఎన్సెఫాలిటిస్’

కేరళలో ‘అమీబిక్ ఎన్సెఫాలిటిస్’

Aravind Maryada Reddy
13 అక్టోబర్, 2025

‘అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్’ అనే వ్యాధి కేరళ రాష్ట్రంలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. ఈ వ్యాధి సోకి ఇప్పటివరకు 23 మంది మృతి చెందారని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 104 కేసులు నమోదయ్యాయి. ‘అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్’ అనే వ్యాధి అమీబా మెదడు మీదే ప్రభావం చూపించే ఒక వ్యాధి. ఈ వ్యాధి అరుదైనది, ప్రాణాంతకం కూడా. కొల్లం, తిరువనంతపురం జిల్లాల్లో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది.

"2023లో కోజికోడ్‌లో నిఫా వైరస్ వ్యాప్తి తర్వాత, అన్ని ఎన్సెఫాలిటిస్ కేసులను తప్పనిసరిగా నివేదించాలని, అలాంటి కేసుల వెనుక ఉన్న కారణాలను గుర్తించాలని నిర్ణయించి ఆదేశాలు జారీ చేశాం. ఫలితంగా, 2024 నుంచి ఎన్సెఫాలిటిస్ కేసులు అధికారికంగా నమోదు కావడం ప్రారంభమైంది. వీటిలో కొన్ని అమీబిక్ ఎన్సెఫాలిటిస్ కేసులుగా గుర్తించాము," అని వైద్యఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాధికి సంబంధించి 2024లోనే ఆరోగ్య శాఖ ఈ వ్యాధి నిర్ధారణ, చికిత్స కోసం సాధారణ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా నీగ్లేరియా ఫౌలెరీ సంక్రమణకు సంబంధించి మరణాల రేటు 98 శాతం ఉందని చెప్పారు. "ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అధ్యక్షతన జరిగిన సంయుక్త సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా, వివిధ శాఖలు కలిసి రాష్ట్రవ్యాప్తంగా శాస్త్రీయ క్లోరినేషన్, ఇతర నివారణ చర్యలను నిరంతరం చేపడుతున్నాయి," అని మంత్రి తెలిపారు.

కేరళలో అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ వ్యాప్తికి కారణాలు

అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ ప్రధానంగా నెగ్లేరియా ఫౌలెరీ అనే అమీబా వల్ల సంక్రమిస్తుంది. ఇది వెచ్చని, లేదా వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఈ అమీబా ఎదుగుతుందని తెలుస్తోంది. మనుషులకు ఈ నీరు సంక్రమించినప్పడు ముఖ్యంగా ముక్కు ద్వారా మెదడుకు చేరుకుని వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఇది అరుదైన వ్యాధి, ప్రపంచవ్యాప్తంగా ఏటా కొన్ని మాత్రమే కేసులు నమోదవుతాయి. కానీ కేరళలో 2024-2025లో గణనీయంగా పెరిగిన కేసులు (104 కేసులు, 23 మరణాలు) ఆందోళన కలిగిస్తున్నాయి.

కేరళలోనే ఎందుకు వ్యాపించింది?

అమీబా 25-40°C ఉన్న నీటిలో, మురికి (క్లోరిన్ లేని) నీటిలో బాగా పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కేరళలో ఈ వ్యాధి వ్యాపించడానికి ముఖ్య కారణాలు ఏమిటంటే.. కేరళ తీరప్రాంత ప్రాంతం కావడం ఒక కారణం. దక్షిణ మాన్సూన్ (జూన్-సెప్టెంబర్) సమయంలో భారీ వర్షాలు పడతాయి. దీంతో నీటి నిల్వలు పెరుగుతాయి. ఇక్కడ సంక్రమిత అమీబా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2024-2025లో కేరళలో అసాధారణంగా భారీ వర్షాలు నమోదుకావడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది.

అరుదైన వ్యాధి

ఈ వ్యాధి సంక్రమిస్తే ప్రపంచవ్యాప్తంగా 98% మరణాలు జరుగుతాయి. ఎందుకంటే ఇది అరుదైనది కాబట్టి డాక్టర్లు త్వరగా గుర్తించలేరు. కానీ కేరళలో 2023 నిఫా వైరస్ వ్యాప్తి తర్వాత ఎన్సెఫాలిటిస్ కేసులను తప్పనిసరిగా నివేదించాలని ఆదేశాలు జారీ చేసి, 2024 నుంచి మెరుగైన గుర్తింపు వ్యవస్థ ఏర్పడింది. నిజానికి మునుపటి సంవత్సరాల్లో గుర్తించని కేసులు ఇప్పుడు నమోదవుతున్నాయి.

కేరళలో వ్యాపించడానికి ప్రత్యేక ప్రత్యేక కారణాలు ఏమిటి?

కేరళలో ఈ వ్యాధి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే (ఉదా., తమిళనాడు లేదా గుజరాత్‌లో కొన్ని కేసులు) ఎక్కువగా వ్యాపించడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణం పర్యావరణ, సామాజిక, మౌలిక సదుపాయాలే కారణమని తెలుస్తోంది. కేరళలోని కొల్లం, తిరువనంతపురం, కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. కొల్లం, తిరువనంతపురం ఇవి దక్షిణ కేరళలోని తీరప్రాంత జిల్లాలు.

కోజికోడ్, మలప్పురం ఉత్తర కేరళలోని మలబార్ ప్రాంతం. 2023 నిఫా వ్యాప్తి ఇక్కడే వ్యాపించింది. ఈ జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అనేక కృత్రిమ నీటికుంటలు ఉన్నాయి. ఈ నీటి కుంటలను ప్రజలు సామూహికంగా నిర్మించుకుంటూ ఉంటారు. ఈ నీటికుంట్లో నీటిని నిల్వచేసి వాటిని వాడుకుంటారు. అయితే ఈ నీటిని క్లోరినేషన్ చేయకపోవడం వల్లే వ్యాధికారక అమిబా ఇక్కడ వ్యాప్తి చెందినట్టు తెలుస్తోంది.

అలాగే, ఇక్కడి వర్షాలు ఎక్కువగా ఉంటాయి. మురికినీరు కూడా అధికం. క్లోరినేషన్ సరిగా జరగకపోవడం వల్ల సంక్రమణ పెరిగిందని తెలుస్తోంది.

నీటి నాణ్యత సమస్యలు

కేరళలో గ్రామీణ ప్రాంతాల్లో 40 శాతంపైగా నీటి నిల్వ కోసం ఉపయోగించే కృత్రిమ కొలనులు ఉన్నాయి. వీటిని సిమెంట్‌తో తయారు చేస్తుంటారు. ఇందులోని నీరు మురికిగా మారడంతో సంక్రమిత అమిబా పెరిగినట్టు అధికారులు చెబుతన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్యశాఖ క్లోరినేషన్ సరిగ్గా చేయకపోవడం కూడా ఒక కారణంగా ఉంది.

రాష్ట్ర ప్రభుత్వ చర్యలు

రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించింది. నీటి కొలనుల వద్ద క్లోరినేషన్ చేపట్టాలని ఆదేశించింది. అయితే రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరిగిన తర్వాత ప్రభుత్వం అప్రమత్తమైంది. అలా కాకుండా ముందుగానే ఈ సమస్య మీద దృష్టి పెట్టి ఉంటే ఈ స్థాయిలో కేసులు, మరణాలు నమోదు అయ్యేవి కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి?

అమీబిక్ ఎన్సెఫాలిటిస్ మెదడు మీద ప్రభావం చూపించే అరుదైన వ్యాధి. ఈ వ్యాధి నీటిలో లేదా నేలలో ఉండే సూక్ష్మజీవుల వల్ల వస్తుంది. అమీబాలు మెదడులోకి చొరబడి నరాలను నాశనం చేస్తాయి. దీని వల్ల మెదడులో వాపు ఏర్పడుతుంది. రక్తప్రసరణ తగ్గుతుంది. నాడీ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది.

సాధారణ లక్షణాలు:

తీవ్రమైన తలనొప్పి

జ్వరం

వాంతులు

మెడ ప్రాంతం గట్టి పడటం

మతిభ్రమించడం, లేదా గందరగోళంగా మాట్లాడటం

చేతి, కాళ్ల కదలికలు సరిగా లేకపోవడం

స్ఫృహ కోల్పోవడం

తీవ్రమైన స్థితిలో రోగి కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది.

ఈ అమీబాలు సాధారణంగా గోరువెచ్చని నీటిలో, సరస్సుల్లో, ఈతకొలనుల్లో, నేలలో జీవిస్తాయి. ముక్కు ద్వారా లేదా గాయాల ద్వారా ఇవి శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఒకసారి శరీరంలోకి వెళ్ళిన తర్వాత రక్తనాళాల ద్వారా మెదడుకు చేరి సంక్రమణ కలిగిస్తాయి.

ఈ వ్యాధికి కారణమయ్యే ప్రధాన అమీబాలు మూడు:

1. నెగ్లేరియా ఫౌలెరీ

2. ఆకంథామీబా

3. బలమూథియా మాండ్రిల్లారిస్

నిర్ధారణ

వైద్యులు సాధారణంగా స్కానింగ్ ద్వారాఈ వ్యాధిని గుర్తిస్తారు. శరీర ద్రవాల్లో అమీబా కణాలు ఉన్నాయా అని పరిశీలిస్తారు. తక్షణంగా పరీక్షలు చేయడం ద్వారా మాత్రమే ప్రాణాలను కాపాడుకోవడం సాధ్యమవుతుంది.

ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి?

శుద్ధి కాని నీటిలో స్విమ్మింగ్ చేయొద్దు.

ముక్కులోకి అపరిశుభ్రమైన నీటిని వెళ్లనివ్వకూడదు. మట్టి లేదా దుమ్ములో పనిచేసేవారు చేతులు తరుచూ శుభ్రపరుచుకోవడం అలవాటు చేసుకోవాలి. తక్కువ ఇమ్యూనిటీ (రోగ నిరోధక శక్తి) ఉన్న వారు నీటి కొలనులకు దూరంగా ఉండటం మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

కేరళలో ‘అమీబిక్ ఎన్సెఫాలిటిస్’ - Tholi Paluku