
కేరళలో అభివృద్ధిపై చర్చకు సిద్ధం: పినరయ్ విజయన్
కేరళ అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయ వేడి మరింత పెరిగింది. ప్రతిపక్ష నేత వి.డి. సతీశన్ విసిరిన ప్రజా చర్చ సవాల్‌ను కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ సోమవారం అంగీకరించారు. సతీశన్ సవాల్ విసిరిన ఒక రోజు తర్వాత, విజయన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ ఎల్‌డీఎఫ్ ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన ‘రిపోర్ట్ కార్డ్’ను పంచుకున్నారు. తన ప్రభుత్వ పనితీరు ‘ఏ-ప్లస్’ స్థాయిలో ఉందని పేర్కొంటూ, ఆ కార్యక్రమాల ఆధారంగా చర్చ జరపడానికి ప్రతిపక్షం సిద్ధంగా ఉందా? అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన సతీశన్ ముఖ్యమంత్రి చర్చకు సిద్ధమని చెప్పారు. కాబట్టి ఆయన నిర్ణయించే సమయం, ప్రదేశానికి నేను వస్తాను. మిగతా విషయాన్ని ప్రజలే నిర్ణయిస్తారని సతీశన్ ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు.
తరువాత కొల్లంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన విజయన్, ప్రతిపక్షం చర్చకు సిద్ధమవడాన్ని స్వాగతించారు. రాష్ట్రంలో చర్చలు జరిపేందుకు అసెంబ్లీనే అత్యంత ముఖ్యమైన వేదిక అని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం సమస్యలను సమర్థవంతంగా లేవనెత్తలేకపోయిందని, ప్రభుత్వ సమాధానాలకు భయపడి చర్చల నుంచి తప్పించుకుందని ఆరోపించారు. ఎన్నికల ముందు జరిగిన చివరి అసెంబ్లీ సమావేశంలో కూడా యూడీఎఫ్ ప్రభుత్వం మీద ఒక్కసారి కూడా వాయిదా తీర్మానం తీసుకురాలేదని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు సాధారణంగా విమర్శలు, అవిశ్వాస తీర్మానాలు చేస్తాయని, గత పదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి విషయంలో వారు నిర్మాణాత్మకంగా వ్యవహరించారా అని ప్రశ్నించారు. అదేవిధంగా యూడీఎఫ్ ఎంపీలు పార్లమెంట్‌లో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతున్నదనే విషయంపై గొంతెత్తలేదని విమర్శించారు. ఈ ప్రశ్నలకు ప్రతిపక్షం సమాధానం ఇవ్వడానికి సిద్ధమైతే ప్రజా చర్చ జరిపేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు.
పదేశ్లలో నిర్మించిన ఇళ్లు ఎన్ని?
ఈ పరిణామం సతీశన్ చేసిన విమర్శల తర్వాత చోటుచేసుకుంది. గత పదేళ్లలో ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల సంఖ్య, మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ప్రభుత్వ కాలంలో నిర్మించిన ఇళ్ల కంటే తక్కువగా ఉందని ఆయన ఆరోపించారు. అభివృద్ధి ప్రాజెక్టులపై పూర్తి వివరాలు అసెంబ్లీలో ఎల్‌డీఎఫ్ మంత్రులు ఇచ్చిన సమాధానాల్లో ఉన్నాయని పేర్కొంటూ, అభివృద్ధి అంశాలపై ఓపెన్ డిబేట్‌కు సిద్ధమని సతీశన్ మళ్లీ చెప్పారు.
ఇదిలా ఉండగా, కొల్లంలో జరిగిన ముఖ్యమంత్రి మీడియా సమావేశం కొంత ఉద్రిక్తతకు దారితీసింది. మూడు ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చిన అనంతరం సమయం ముగిసిందని చెప్పి విజయన్ సమావేశాన్ని ముగించారు. అయితే కొంతమంది జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేయడంతో ఆయన మళ్లీ వచ్చి మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
