
కేరళలో అధికారంలోకి వస్తాం: ప్రధాని మోడీ
కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోడీ ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ కూటములపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ రెండు కూటములు రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయంటూ ఆరోపిస్తూ, ఈసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేరళలో ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేరళలో టీమ్ బీజేపీ, టీమ్ ఎన్డీయేనే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి. ప్రజల ఆశీస్సులతో మేము అధికారంలోకి వస్తాం. కేరళ అభివృద్ధికి ఎటువంటి లోటు ఉండనివ్వమని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారుతోందని, ప్రజల్లో మార్పు కోరిక స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. యువత, మహిళలు, రైతులు బీజేపీ, ఎన్డీయేపై విశ్వాసం పెంచుకుంటున్నారని తెలిపారు. ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌లపై తీవ్ర విమర్శలు చేస్తూ ఈ రెండు కూటములు పరస్పరం అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయి. కొన్నేళ్లు ఎల్‌డీఎఫ్ పాలన చేస్తుంది, తర్వాత యూడీఎఫ్ వచ్చి అదే దోపిడీ కొనసాగిస్తుంది. ఈ విధంగా కేరళ చిక్కుకుపోయిందని వ్యాఖ్యానించారు. ఇరు కూటములు ఒకరినొకరు బీజేపీ ‘బీ-టీమ్’గా విమర్శించుకోవడం ప్రస్తావిస్తూ అది నిజానికి బీజేపీనే అసలు ‘ఏ-టీమ్’ అని వారు ఒప్పుకున్నట్టే అని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాల కాలంలో జరిగిన అవినీతి వ్యవహారాలన్నింటినీ విచారిస్తామని, ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
గత పదేళ్లలో కేరళ అప్పులు పెరిగాయి
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పనిచేస్తున్నారని, కానీ కేరళలో మాత్రం పరస్పరం విమర్శించుకుంటున్నారని పేర్కొంటూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్ర అప్పులపై కూడా ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. గత పదేళ్లలో కేరళ అప్పులు మూడు రెట్లు పెరిగి రూ.5 లక్షల కోట్లకు చేరాయి. ఈ డబ్బు ఎక్కడికి వెళ్తోంది? అది ఎల్‌డీఎఫ్ నాయకుల జేబుల్లోకి వెళ్తోందని ఆరోపించారు. కేంద్రం నుంచి కేరళకు గతంతో పోలిస్తే ఎక్కువ నిధులు అందుతున్నాయని పేర్కొంటూ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పాలక్కాడ్ అభివృద్ధిని ప్రస్తావిస్తూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఐఐటీ ఏర్పాటు జరిగింది. రైల్వే స్టేషన్లు ఆధునికీకరణ, హైవేలు అభివృద్ధి, స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. మహిళా సాధికారతపై దృష్టి సారిస్తూ, మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచేందుకు ‘నారీ శక్తి వందన్ చట్టం’ తీసుకువచ్చినట్లు చెప్పారు. కాంగ్రెస్ నాయకులపై ఆరోపణలు చేస్తూ, మహిళల భద్రత విషయంలో వారు విఫలమయ్యారని అన్నారు. ఇటీవల ఒక కాంగ్రెస్ నాయకుడిపై వచ్చిన ఆరోపణల కారణంగా పార్టీ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. గత ఎన్నికలను ప్రస్తావిస్తూ, పాలక్కాడ్‌లో బీజేపీ అభ్యర్థి ఈసారి శోభా సురేంద్రన్‌ను బరిలోకి దించామని, ఆమెను గెలిపించాలని ప్రజలను కోరారు. మొత్తంగా కేరళలో ఈసారి రాజకీయ పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారగా, బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఎన్నికల వేళ చర్చనీయాంశంగా మారాయి.
