Let's talk: editor@tmv.in
కేరళలో అక్రమ లాటరీ కుంభకోణం

కేరళలో అక్రమ లాటరీ కుంభకోణం

Panthagani Anusha
24 అక్టోబర్, 2025

కేరళలో అక్రమ లాటరీ కార్యకలాపాలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కేరళ రాష్ట్ర వర్తక పారిశ్రామిక సమితి అగ్రనేతలపై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ సంస్థ నాయకులు అధికారిక ఓనం బంపర్ లాటరీని పోలిన కూపన్లను ముద్రించి విక్రయించడంతో పాటు, నిషేధిత బహుమతి డ్రా నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

కొల్లం జిల్లా లాటరీ అధికారి మంగళవారం దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా, కొల్లం తూర్పు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితులు విక్రయించిన కూపన్లపై కేరళ లాటరీ విభాగం ఉపయోగించే ఓనం బంపర్ లాటరీ లోగోను పోలిన చిహ్నాలు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు దర్యాప్తు అధికారుల ప్రకారం అక్టోబర్ 2న ఈ అక్రమ లాటరీ డ్రా నిర్వహణ పూర్తయినప్పటికీ కూపన్ల అమ్మకాలు కొనసాగించి బహుమతుల పేరుతో డ్రా నిర్వహించడం ద్వారా నిందితులు ప్రభుత్వ లాటరీ ఆదాయానికి నష్టం కలిగించినట్లు పోలీసులు వెల్లడించారు.

కాగా ఈ కేసులో కేరళ రాష్ట్ర వ్యాపారి వ్యాపారుల సమితి అధ్యక్షుడు ఆర్. రాధాకృష్ణన్, కార్యదర్శి సునీల్ షంసుద్దీన్, కోశాధికారి ఆర్. సంతోష్‌లపై ప్రధాన ఆరోపణలు నమోదయ్యాయి. లాటరీ అధికారి సమర్పించిన ఫోటోలు, వీడియో ఆధారాలను పరిశీలించిన పోలీసులు, ఈ ముగ్గురు నాయకులు అక్రమ లాటరీ కూపన్ల ముద్రణ, విక్రయం, డ్రా నిర్వహణలో నేరుగా పాల్గొన్నట్లు నిర్ధారించారు. నిందితులు ప్రజలను మోసం చేయడంతో పాటు, ప్రభుత్వానికి ఆర్థిక నష్టం కలిగించారని అధికారిక లాటరీ వ్యవస్థపై గందరగోళం సృష్టించారని పోలీసులు తెలిపారు. అదనంగా ప్రైవేట్ లాటరీల నిషేధాన్ని కూడా ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

పోలీసులు ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 318(2) కింద మోసపూరిత చర్యల ద్వారా ప్రభుత్వానికి,ప్రజలకు నష్టం కలిగించినందుకు కేసు నమోదు చేశారు. అదేవిధంగా లాటరీల (నియంత్రణ) చట్టం 1998లోని సెక్షన్ 3, సెక్షన్ 7(3) ప్రకారం ప్రైవేట్ లాటరీల నిర్వహణ, విక్రయం నిషేధం కావడంతో ఈ చట్టాల కింద కూడా కేసు నమోదైంది. ఈ చట్టాల ప్రకారం నిందితులకు గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

మరోవైపు విక్రయించిన కూపన్ల సంఖ్య, సేకరించిన మొత్తం, బహుమతుల విలువ వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ నిందితులను విచారణ కోసం హాజరుకావాలని ఆదేశించారు. కాగా ఈ ఘటనతో కేరళలో లాటరీ వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కేరళ రాష్ట్ర వ్యాపారి వ్యాపారుల సమితి అంటే ఏమిటి**?

ఓనం బంపర్ లాటరీ కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అత్యంత ప్రజాదరణ పొందిన లాటరీలలో ఒకటి. ఇది ప్రతి సంవత్సరం ఓనం పండుగ సందర్భంగా జరుగుతుంది. కేరళ లాటరీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ లాటరీ భారీ బహుమతులను అందిస్తుంది.

2025 సంవత్సరానికి సంబంధించిన ఓనం బంపర్ లాటరీ వివరాలు

టికెట్ ధర రూ. 500/- ఉండగా మొదటి బహుమతి రూ. 25 కోట్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా.రెండవ బహుమతి రూ. 1 కోటి (బహుళ విజేతలకు), మూడవ బహుమతి రూ. 50 లక్షలు, అదేవిదంగా రూ. 5,000/- నుంచి రూ. 1 లక్ష వరకు వివిధ స్థాయిలలో చిన్న బహుమతులు అందజేస్తారు. ఈ లాటరీ డ్రా సాధారణంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో జరుగుతుంది, కాగా ఈ సంవత్సరంలో అక్టోబర్ 2న నిర్వహించారు.ఇదిలా ఉండగా లక్షల సంఖ్యలో టికెట్లు అధికారిక లాటరీ ఏజెన్సీల ద్వారా అమ్మకాలు జరుగుతాయి. ఈ లాటరీ కొనుగోళ్లు ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయాన్ని సమకూరుస్తాయి.

కేరళలో అక్రమ లాటరీ కుంభకోణం - Tholi Paluku