
కేరళలోనూ 'భూభారతి' అమలు చేస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
కేరళ రాష్ట్రంలో అధికార ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని, ప్రజలు మార్పును కోరుకుంటున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మావేలిక్కర అసెంబ్లీ నియోజకవర్గంలో యూడీఎఫ్ అభ్యర్థి ముతర రాజ్ మద్దతుగా రోడ్ షో, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసి ప్రజల నమ్మకాన్ని గెలుచుకుందని పొంగులేటి గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో కేరళలో యూడీఎఫ్ అధికారంలోకి రాగానే 'ఐదు గ్యారంటీలను' అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా, భూ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణలో తెచ్చిన 'భూభారతి' విధానాన్ని కేరళలో కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
గత పదేళ్లుగా అధికారంలో ఉన్న సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని విమర్శించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారంలో, పెట్టుబడులను ఆకర్షించడంలో లెఫ్ట్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కేరళ గడ్డపై బీజేపీ సాగించే విభజన రాజకీయాలకు తావులేదని, ఆ పార్టీని ప్రజలు ఎన్నటికీ ఆదరించరని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు కేవలం ఓటు వేయడం గురించి మాత్రమే కాదని, కేరళ భవిష్యత్తును మార్చేవని పొంగులేటి పేర్కొన్నారు. పారదర్శకమైన, ప్రజల కేంద్రంగా సాగే పరిపాలన కోసం యూడీఎఫ్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కేరళ ప్రజలను కోరారు. ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే యూడీఎఫ్ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కేరళలో ఏప్రిల్ 9న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. 1982 నుంచి కేరళలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్ ప్రభుత్వాలు మారుతూ వచ్చేవి. అయితే, 2021లో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి ఆ సంప్రదాయాన్ని బద్దలు కొట్టింది. ఈసారి ఎలాగైనా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని యుడిఎఫ్ భావిస్తుండగా, తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల విజయంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ కూడా సత్తా చాటాలని చూస్తోంది.
