
కేరళంలో సంవత్సరానికి రెండు ఉచిత సిలిండర్లు ఇస్తాం: బీజేపీ
కేరళం అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి మంగళవారం తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో పేద మహిళలకు ఆర్థిక సహాయం, పేద కుటుంబాలకు సంవత్సరానికి రెండు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు, రాష్ట్రంలో ఏఐఐఎంఎస్ స్థాపన వంటి పలు హామీలు ఇచ్చింది. మేనిఫెస్టోను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దశాబ్దాలుగా అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాల వల్ల కేరళలో పారిశ్రామిక అభివృద్ధి పెద్దగా జరగలేదని ఆరోపించారు. ఈ రెండు కూటములు ‘మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు’ చేస్తూ రాష్ట్రాన్ని ఆర్థికంగా వెనక్కు నెట్టాయని విమర్శించారు. మేనిఫెస్టో ప్రకారం పేద, బీపీఎల్ కుటుంబాలకు చెందిన ప్రతి మహిళకు ‘భక్ష్య ఆరోగ్య సురక్షా కార్డు’ ఇవ్వనున్నారు. దీనికి నెలకు రూ.2,500 రీచార్జ్ చేసి ఔషధాలు, కిరాణా సరుకులు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. అలాగే పేద కుటుంబాల మహిళా ప్రధానులకు, వితంతువులకు, 70 ఏళ్లకు పైబడిన వృద్ధులకు నెలకు రూ.3,000 పింఛన్ అందజేస్తామని ప్రకటించారు.
శబరిమల ఘటనపై సీబీఐతో విచారణ చేయిస్తాం
పేద కుటుంబాలకు ప్రతి ఏడాది ఓనం, క్రిస్మస్ పండుగల సందర్భంగా ఒక్కొక్కటి చొప్పున రెండు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి నెలకు 20,000 లీటర్ల ఉచిత తాగునీరు సరఫరా చేస్తామని కూడా హామీ ఇచ్చారు. మతపరమైన స్థలాల రక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని ఎన్డీయే తెలిపింది. ముఖ్యంగా శబరిమల, గురువాయూర్ వంటి ఆలయాల నిర్వహణలో భక్తులకు ఎక్కువ భాగస్వామ్యం కల్పించేలా దేవస్వం బోర్డులను పునర్వ్యవస్థీకరించనున్నట్లు ప్రకటించింది. శబరిమల బంగారం మాయమైన ఘటనపై కాలపరిమితి గల సీబీఐ దర్యాప్తు జరిపిస్తామని కూడా హామీ ఇచ్చింది. ఇంకా శబరిమలలో యాత్రికుల సౌకర్యాల కోసం భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమం చేపడతామని పేర్కొంది. రైతులకు అవసరమైన పంటలకు కనీస మద్దతు ధర అందించడమే కాకుండా, ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలోని ప్రతి మలయాళీకి విస్తరించనున్నట్లు వెల్లడించింది. రవాణా రంగంలో కొచ్చి మెట్రో అన్ని దశలను పూర్తి చేయడంతో పాటు తిరువనంతపురం, కోజికోడ్‌లలో కొత్త మెట్రో సేవలు ప్రారంభిస్తామని ప్రకటించింది. అలాగే తిరువనంతపురం నుంచి కన్నూర్ వరకు హైస్పీడ్ రైల్వే నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
పరిశ్రమల అభివృద్ధికి ఉద్యోగం సృష్టించే సంస్థలకు ఒక్క ఉద్యోగానికి రూ.1 లక్ష సాఫ్ట్ లోన్ అందించే ‘ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్’ ప్రారంభించనున్నట్లు తెలిపింది. అదే విధంగా విజిన్‌జం పోర్ట్ ను భారీ పారిశ్రామిక సముదాయంగా అభివృద్ధి చేయాలని ఎన్డీయే లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలను ప్రత్యేక ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేసే ప్రణాళికను కూడా మేనిఫెస్టోలో వెల్లడించింది.
