
కేరళంలో రెండు సంవత్సరాల్లో ఎయిమ్స్‌ను ప్రారంభిస్తాం: అమిత్‌షా
కేరళంలో ఏప్రిల్ 9న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా క్రైస్తవ సమాజానికి చేరువయ్యారు. ఈస్టర్ పండుగ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. కొచ్చి సమీపంలోని కున్నత్తునాడు నియోజకవర్గంలో జరిగిన సభలో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం వస్తే రెండు సంవత్సరాల్లోనే తొలి ఎయిమ్స్‌ను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అలాగే శబరిమల ఆలయంలో బంగారం దుర్వినియోగం జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ, ఎన్డీయే అధికారంలోకి వస్తే రెండు నెలల్లోనే బాధ్యులపై చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తామని తెలిపారు.
ప్రతిపక్షాలపై విమర్శలు
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఇంధన ధరల పెరుగుదలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగినా భారత్‌లో పరిస్థితిని సమర్థంగా నియంత్రించామని చెప్పారు. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌పై కూడా షా విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చి క్రెడిట్ తీసుకుంటోందని ఆరోపించారు. కేంద్రం పంపిన నిధులతో చేపట్టిన ప్రాజెక్టులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ పేర్లు జోడించుకుంటోందని అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా( మార్క్సిస్ట్) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్, అలాగే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్‌పై షా తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రం వెలుపల ఈ రెండు పార్టీలూ కలసి పోటీ చేస్తూ, కేరళలో మాత్రం పరస్పరం పోటీ పడుతున్నాయని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ విధానం ‘అందరికీ న్యాయం – ఎవరికీ వ్యతిరేకం కాదు’ అనే సిద్ధాంతంపై నడుస్తోందని ఆయన తెలిపారు. అలాగే దేశ భద్రతకు ముప్పుగా ఉన్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకున్నామని, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలను అణచివేశామని చెప్పారు. కేరళ భవిష్యత్తును మార్చే ఎన్నికలుగా ఈసారి అసెంబ్లీ ఎన్నికలను అభివర్ణించిన షా, రాష్ట్రంలో ఎన్డీయే ఓట్ల శాతం గత కొన్ని ఎన్నికల నుంచి పెరుగుతోందని పేర్కొన్నారు. ఈసారి ప్రజలు మార్పుకు అవకాశం ఇస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
