
కేరళంలో పోలింగ్ రోజు ఓటర్లకు ఉబెర్ ఉచిత ప్రయాణం
కేరళం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు ఉబెర్ ఇండియా ప్రకటించింది. ఏప్రిల్ 9న జరిగే 2026 కేరళం శాసనసభ ఎన్నికల సందర్భంగా ఎర్నాకులం, తిరువనంతపురం జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంతో కలిసి అమలు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు రవాణా సమస్యలు ఎదురుకాకుండా చేయడం, ఓటింగ్ శాతం పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యంగా పేర్కొన్నారు.
ఉబెర్ యాప్ ద్వారా కార్, ఆటో, బైక్ సేవల్లో ఓటర్లు తమ పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకోవచ్చు. యాప్‌లోనే అన్ని పోలింగ్ కేంద్రాల స్థానాలను గుర్తించి చూపే విధంగా ఏర్పాటు చేశారు. పికప్ పాయింట్ నుంచి 2 కిలోమీటర్ల వరకు ప్రయాణం పూర్తిగా ఉచితం. రెండు కిలోమీటర్లకు మించి ప్రయాణిస్తే అదనపు దూరానికి మాత్రమే సాధారణ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
భారత ఎన్నికల సంఘం మార్చి 15న కేరళలోని 140 స్థానాల అసెంబ్లీకి ఎన్నికలను ఏప్రిల్ 9న ఒకే దశలో నిర్వహిస్తామని ప్రకటించింది. ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పినరయ్ విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌ను అధికారంలో నుంచి దింపాలని యూడీఎఫ్, ఎన్డీయే ప్రయత్నిస్తోంది.
