
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రతిపాదనపై సంయుక్త పరిశీలన
నగరంలో ప్రతిపాదిత కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రాజెక్టు పనులు, ఇటీవల చేపట్టిన వన్‌వే ట్రాఫిక్ ట్రయల్స్‌లో తలెత్తిన క్షేత్రస్థాయి సమస్యలపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ. కర్ణన్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ సంయుక్తంగా తెల్లవారుజామున క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు.
ఈ సంయుక్త తనిఖీల్లో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ సంతోష్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్, ట్రాఫిక్ డీసీపీ కాజల్ సింగ్, జీహెచ్‌ఎంసీ చీఫ్ ఇంజనీర్‌తో పాటు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్, జలమండలి, ఉద్యానవన శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమీక్షలో భాగంగా అధికారులు ఫ్లైఓవర్ అలైన్‌మెంట్, ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికలు, విద్యుత్, నీటి పైప్‌లైన్ల మార్పిడి అవసరాలు, రోడ్డు భద్రతా చర్యలు, ల్యాండ్‌స్కేపింగ్ ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించారు.హెచ్‌సిటీ చొరవలో భాగంగా నిర్వహించిన వన్‌వే ట్రాఫిక్ ట్రయల్స్ ద్వారా వాహనాల రాకపోకల సరళిని, ఎదురవుతున్న నిర్వహణ సవాళ్లను అధికారులు అంచనా వేశారు. వాహనదారులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, నిరంతరాయంగా నిర్మాణ పనులు సాగేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు, భద్రతా ప్రోటోకాల్స్ పాటిస్తూనే ముందస్తు నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలన్నారు.
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ. కర్ణన్ మాట్లాడుతూ.. ప్రాజెక్టు వేగవంతమైన అమలు కోసం సంబంధిత అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న అనుమతులను వేగంగా పూర్తి చేయాలని, శాఖల మధ్య ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించి, ప్రయాణికులకు కనీస అసౌకర్యం కలగకుండా ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలని ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీలను, అధికారులను ఆదేశించారు.
