Let's talk: editor@tmv.in
కేఫ్ పేరుతో హుక్కా సెంటర్: రంగారెడ్డి జిల్లాలో పోలీసుల దాడి

కేఫ్ పేరుతో హుక్కా సెంటర్: రంగారెడ్డి జిల్లాలో పోలీసుల దాడి

Gaddamidi Naveen
18 మార్చి, 2026

జిల్లాలో కేఫ్ పేరుతో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అక్రమ హుక్కా సెంటర్‌పై తెలంగాణ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్‌లో ఉన్న 'ది వైట్ కప్' కేఫ్‌లో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, కస్టమర్లతో కలిపి మొత్తం 39 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల తెలిపిన‌ వివరాల ప్రకారం, కేఫేగా అనుమతి పొందిన ఈ స్థలం వాస్తవానికి హుక్కా అక్రమంగా నడుస్తోంది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా దాడి చేసిన పోలీసులు మొత్తం 39 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 35 మంది కస్టమర్లు కాగా, మరో నలుగురు హుక్కా సరఫరాదారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

దాడి సమయంలో పోలీసులు 36 మొబైల్ ఫోన్లు, అనేక హుక్కా పాత్రలను స్వాధీనం చేసుకున్నారు. కేఫే నిర్వాహకులు మోహన్, సాగర్ కలిసి ఈ వ్యాపారం నడుపుతున్నారని, ఒక్కో వ్యక్తి నుంచి రూ.800 నుంచి రూ.1,200 వరకు వసూలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనపై ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య గౌడ్ మాట్లాడుతూ, కేఫే పేరుతో హుక్కా సెంటర్ నిర్వహించడం చట్టవిరుద్ధమని తెలిపారు. ఇలాంటి కార్యకలాపాలు యువతపై ప్రతికూల ప్రభావం చూపుతూ వారి భవిష్యత్తును దెబ్బతీస్తాయని ఆయన అన్నారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అరెస్టయిన వారిలో కొత్తపేట, సరూర్ నగర్, హయాత్ నగర్, ఫలక్‌నుమా, ఉప్పల్ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరు ప్రత్యేకంగా హుక్కా సేవించడానికి అక్కడికి వచ్చినట్లు విచారణలో వెల్లడైంది. ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచించారు. 100 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించడం ద్వారా సమాచారం ఇవ్వవచ్చని చెప్పారు.

ఈ దాడి ఎల్‌బీ నగర్ పోలీసులు అక్రమ హుక్కా కేంద్రాలపై కొనసాగిస్తున్న చర్యల్లో భాగంగా చేపట్టినదని అధికారులు స్పష్టం చేశారు. యువతను తప్పుదోవ పట్టించే ఇలాంటి కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.