
కేటీఆర్ ఆరోపణలు అబద్ధాల పుట్ట: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేటీఆర్ కేవలం "అసత్య ప్రచారాలు" చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
గత రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ఏమీ చేయలేదన్న కేటీఆర్ విమర్శలను చామల కిరణ్ కుమార్ రెడ్డి తోసిపుచ్చారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు అన్నీ చేసేశామన్నట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నారని, కానీ వాస్తవానికి హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధికి పునాది వేసింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రాన్ని రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో అప్పగిస్తే, బీఆర్ఎస్ తన తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని రూ. 8 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిందని ఎంపీ ఆరోపించారు. గత తొమ్మిదేళ్లలో రాష్ట్రానికి జరిగిన మేలు కంటే, కేసీఆర్ ఒక అద్భుతమైన ఫామ్‌హౌస్‌ను నిర్మించుకోవడమే పెద్ద విజయమని ఆయన ఎద్దేవా చేశారు. అధికారం కోల్పోయామనే బాధతో మీకు నిద్ర పట్టడం లేదు. ప్రజలను అమాయకులుగా భావించకండి అని హితవు పలికారు.
తెలంగాణ వనరులను తరతరాలుగా దోచుకోవాలనే బీఆర్ఎస్ నేతల పన్నాగాలకు ప్రజలు అడ్డుకట్ట వేశారని, ఆ ఫ్రస్ట్రేషన్‌లోనే కేటీఆర్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చామల విమర్శించారు. అంతకుముందు కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో దోచుకో-దాచుకో పథకం నడుస్తోందని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నేతలు లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆయన పునరుద్ఘాటించారు.
