Let's talk: editor@tmv.in
కేటీఆర్ అబద్ధాల్లో నోబెల్ విజేత: నాగర్‌కర్నూల్‌లో టీపీసీసీ చీఫ్

కేటీఆర్ అబద్ధాల్లో నోబెల్ విజేత: నాగర్‌కర్నూల్‌లో టీపీసీసీ చీఫ్

Gaddamidi Naveen
8 ఏప్రిల్, 2026

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే వంశీ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ న్యూయార్క్‌లోని కొలంబియా బిజినెస్ స్కూల్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పచ్చి అబద్ధాలు ఆడారని మండిపడ్డారు. లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రగల్భాలు పలికిన కేటీఆర్ మాటలు తప్పని, కేవలం 86 వేల ఎకరాలకే నీరందిందని ఆ ప్రాజెక్ట్ ఈఎన్‌సీ మురళీధర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అబద్ధాలు ఆడడంలో కేటీఆర్‌కు నోబెల్ ప్రైజ్ ఇవ్వొచ్చు అని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, దేశానికే రోల్ మోడల్‌గా కుల గణన చేపడుతున్నామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా, పార్టీ పదవుల్లోనూ సామాజిక సమీకరణాలను పాటించామన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, కానీ తమ ప్రభుత్వం కొత్త కార్డులు ఇవ్వడమే కాకుండా ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తోందని ఆయ‌న వివరించారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని టీపీసీసీ చీఫ్ పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. నిధుల కొరత ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం తన వంతు బాధ్యతగా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తుందని భరోసా ఇచ్చారు.