Let's talk: editor@tmv.in
కేజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యంతో నా బిడ్డను కోల్పోయాను

కేజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యంతో నా బిడ్డను కోల్పోయాను

Panthagani Anusha
1 ఫిబ్రవరి, 2026

విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్) వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గర్భంలోనే తన శిశువును కోల్పోయానంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తక్షణమే స్పందించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున పూర్తి భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చిన ఆయన సోమవారం బాధిత మహిళను కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయానికి దగ్గరుండి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

శుక్రవారం రాత్రి విశాఖ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న సమయంలో విశాఖ విమానాశ్రయంలో పట్నాల ఉమాదేవి అనే మహిళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసి తన గోడును వెల్లబోసుకున్నారు. గత ఏడాది డిసెంబర్ తొలి వారంలో కాన్పు నిమిత్తం కేజీహెచ్‌లో చేరిన తనకు వైద్యులు, సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంగా, అమానవీయంగా వ్యవహరించారని ఆమె ఫిర్యాదు చేశారు.

కాన్పుకు నిర్ణయించిన గడువు పూర్తయ్యిందని తెలిసినా సిజేరియన్‌కు నిర్ణయం తీసుకోకుండా సాధారణ కాన్పు పేరిట తీవ్ర శారీరక, మానసిక వేదనకు గురి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులు పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ వైద్యులు పట్టించుకోలేదని, పైగా తీవ్ర పదజాలంతో దూషించారని ఆరోపించారు. కాన్పు సమయంలో తనపై అమానవీయంగా ప్రవర్తించారని, చివరి నిమిషం వరకు సరైన వైద్య నిర్ణయం తీసుకోకపోవడం వల్ల మృత శిశువుకు జన్మనివ్వాల్సి వచ్చిందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. కేజీహెచ్ సిబ్బంది తీరుతో శారీరక హింసతో పాటు జీవితకాలం మానసిక వేదన మిగిలిందని పేర్కొన్నారు.

ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధిత మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులతో ప్రత్యక్షంగా మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవాలని నిర్ణయించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మానవీయ సేవలు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.

కేజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యంతో నా బిడ్డను కోల్పోయాను - Tholi Paluku