Let's talk: editor@tmv.in
కేజీబీవీ టెండర్లలో భారీ అక్రమాలు జరిగాయి: సీపీఐ

కేజీబీవీ టెండర్లలో భారీ అక్రమాలు జరిగాయి: సీపీఐ

Pinjari Chand
20 ఆగస్టు, 2026

పేద, బలహీన వర్గాల విద్యార్థినులు చదువుతున్న కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)కు వస్తువుల సరఫరా కోసం నిర్వహించిన టెండర్లలో భారీ అక్రమాలు, ప్రజాధనం దుర్వినియోగం జరిగాయంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాసి, టెండర్లపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. కేజీబీవీలకు సరఫరా చేసే ప్రొవిజన్స్‌ ధరలను మార్కెట్‌, ఎంఆర్‌పీ ధరల కంటే 30 నుంచి 40 శాతం వరకు అధికంగా నిర్ణయించారని ఈశ్వరయ్య ఆరోపించారు. దీనివల్ల ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ప్రజాధనం నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టెండర్ల వ్యవహారంలో సుమారు రూ.25 కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. టెండర్లలో ఎంపికైన కొంతమంది బడా కాంట్రాక్టర్లకు భారీగా లబ్ధి చేకూర్చి, చిన్న, మధ్య తరహా కాంట్రాక్టర్లకు అన్యాయం చేశారని సీపీఐ ఆరోపించింది. బల్క్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా ధరలు తగ్గాల్సి ఉండగా.. ఇందుకు విరుద్ధంగా ధరలు ఎందుకు పెరిగాయో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్‌ చేసింది. బ్లింకిట్‌, బిగ్‌బాస్కెట్‌, జెప్టో వంటి ఆన్‌లైన్‌ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ల ధరలను మార్కెట్‌ ధరలకు ప్రామాణికంగా పరిగణించడంపైనా సీపీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. టెండర్‌ ప్రక్రియలో పారదర్శకతపై అనేక అనుమానాలు ఉన్నాయని, సంబంధిత అధికారుల పాత్రపై సమగ్ర విచారణ జరపాలని కోరింది. టెండర్లలో 20 వేల చదరపు అడుగుల గోడౌన్‌, సరఫరా సామర్థ్యం వంటి అర్హతలను నిర్దేశించినప్పటికీ.. వాటి అమలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

టెండర్లు రద్దు చేయాలి

కేజీబీవీ టెండర్లలో జరిగినట్లు ఆరోపణలు ఎదురవుతున్న అక్రమాలు, అవినీతిపై ఆడిట్‌, విజిలెన్స్‌ దర్యాప్తుతో పాటు సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కోరారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అధిక ధరలకు నిర్వహించిన కేజీబీవీ టెండర్లను తక్షణమే రద్దు చేసి, పూర్తిగా పారదర్శకంగా కొత్తగా టెండర్‌ ప్రక్రియ చేపట్టాలని సీపీఐ కోరింది. కేజీబీవీ విద్యార్థినులకు నాణ్యమైన ఆహారం, నిత్యావసర వస్తువులు సరైన పరిమాణంలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. పేద విద్యార్థినుల సంక్షేమం పేరుతో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని, టెండర్‌ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించి అవినీతికి అడ్డుకట్ట వేయాలని సీపీఐ డిమాండ్‌ చేసింది.