Let's talk: editor@tmv.in
కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ బృందంతో సీఎం రేవంత్‌ భేటీ

కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ బృందంతో సీఎం రేవంత్‌ భేటీ

Gaddamidi Naveen
23 ఆగస్టు, 2026

తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో లండన్‌లోని కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీకి చెందిన అకడమిక్‌ బృందంతో ఫలప్ర‌ద‌మైన సమావేశం నిర్వహించింది. ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, సీనియర్‌ అధికారులు కె. రామకృష్ణారావు, జయేశ్‌ రంజన్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి విద్యా, పరిశోధన, ఆవిష్కరణల కేంద్రాన్ని అభివృద్ధి చేసే అవకాశాలను వారు కేంబ్రిడ్జ్‌ బృందం ముందుంచారు.

హైదరాబాద్‌లో ప్రముఖ అంతర్జాతీయ విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరించి, ప్రపంచస్థాయి నాలెడ్జ్‌ హబ్‌ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సీఎం కోరారు. కేంబ్రిడ్జ్‌ జడ్జ్‌ బిజినెస్‌ స్కూల్‌లో భారత ప్రభుత్వం ప్రాయోజిత మార్కెటింగ్‌ ప్రొఫెసర్‌ జైదీప్‌ ప్రభు, అదే సంస్థకు చెందిన ప్రొఫెసర్‌ వెంకట్‌ గండికోట తెలంగాణతో భాగస్వామ్యంపై ఆసక్తి వ్యక్తం చేశారు.

ఇరుపక్షాలు భవిష్యత్‌ సహకారానికి ప్రత్యేక కార్యాచరణ రూపకల్పనపై అంగీకరించాయి. హైదరాబాద్‌లో విద్యా కార్యక్రమాల నిర్వహణ, సంయుక్త పరిశోధనలకు ప్రోత్సాహం, స్టార్టప్‌లు, వ్యాపారవేత్తలకు మద్దతు, ఇంక్యుబేషన్‌ కార్యక్రమాల అభివృద్ధి వంటి అంశాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఈ భాగస్వామ్యం తెలంగాణలో విద్య, పరిశోధన, ఆవిష్కరణల రంగాలకు మరింత ఊతమిస్తుందని అధికారులు పేర్కొన్నారు.