


కేంద్ర సాయుధ బలగాల ఆత్మగౌరవంపై రాహుల్ గాంధీ గళం
భారతదేశ అంతర్గత భద్రతలో కీలక పాత్ర పోషించే కేంద్ర సాయుధ పోలీసు బలగాల నాయకత్వ హక్కులపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రమైన చర్చను లేవనెత్తారు. దేశ రక్షణ కోసం, ఉగ్రవాద వ్యతిరేక పోరాటాల్లో, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న జవాన్లకు, వారి స్వంత సంస్థను నడిపించే అవకాశం లేకపోవడం ఒక పెద్ద వివక్ష అని ఆయన అభివర్ణించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం పొందిన 'కేంద్ర సాయుధ బలగాల (సాధారణ పరిపాలన) బిల్లు, 2026' ఈ వివాదానికి ప్రధాన కారణం. ఈ చట్టం వల్ల దశాబ్దాలుగా దళంలోనే ఉండి సేవలు అందిస్తున్న కేడర్ అధికారుల పదోన్నతులకు అడ్డుకట్ట పడుతుందని, ఇది వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ "సంస్థాగత అన్యాయాన్ని" సరిదిద్ది, ప్రతి జవానుకు తగిన గౌరవం, హక్కులు కల్పిస్తామని ఆయన గట్టిగా హామీ ఇచ్చారు.
ఈ వివాదానికి మూలకారణం నూతన చట్టంలోని నియామక నిబంధనలు. కొత్తగా నోటిఫై చేయబడిన చట్టం ప్రకారం, సీఏపీఎఫ్ లలోని అత్యున్నత పదవులైన ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) పోస్టుల్లో 50 శాతం, అడిషనల్ డైరెక్టర్ జనరల్ పోస్టుల్లో కనీసం 67 శాతం ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)అధికారులకే కేటాయించబడతాయి. మరీ ముఖ్యంగా, స్పెషల్ డైరెక్టర్ జనరల్, డైరెక్టర్ జనరల్ వంటి అత్యున్నత స్థాయి పదవులను కేవలం డెప్యుటేషన్ ద్వారా(అంటే ఇతర సర్వీసుల నుండి వచ్చే అధికారులతో) మాత్రమే భర్తీ చేస్తారు. దీనివల్ల సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ వంటి దళాలలో అసిస్టెంట్ కమాండెంట్‌గా కెరీర్ ప్రారంభించి, క్షేత్రస్థాయిలో అపారమైన అనుభవం గడించిన కేడర్ అధికారులకు తమ స్వంత దళానికి అధిపతి అయ్యే అవకాశం పూర్తిగా మూసుకుపోతుంది. ఈ విధానం వల్ల సంస్థాగత నైపుణ్యం కంటేబయటి వ్యక్తుల ఆధిపత్యం పెరుగుతుందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ పరిస్థితిని “హాస్యాస్పదమైనది” అని పేర్కొన్నారు. ఏ సంస్థ అయినా తన సొంత వ్యక్తులను నాయకత్వ స్థానంలో ఉంచుకోలేనప్పుడు, ఆ సంస్థ యొక్క ఆత్మగౌరవాన్ని, పనితీరును కాపాడటం అసాధ్యమని ఆయన వాదించారు. సరిహద్దుల్లో శత్రువులతో పోరాడుతూ, అంతర్గత కల్లోలాలను అణిచివేస్తూ గాయపడుతున్న జవాన్లను ఉద్దేశించి మాట్లాడుతూ"వారిని ప్రాణాలు ఇవ్వమని కోరుతున్నాం, కానీ వారి సంస్థను వారు నడుపుకోవడానికి మాత్రం అనుమతించడం లేదు" అని ఆయన ఎత్తిచూపారు. ఇది కేవలం పరిపాలనాపరమైన సమస్య కాదని, ఇది లక్షలాది మంది జవాన్ల భావోద్వేగాలకు, వారి వృత్తిపరమైన గుర్తింపుకు సంబంధించిన అంశమని ఆయన నొక్కి చెప్పారు. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, వంటి బలగాలలోని ప్రతి జవానుకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ వ్యవహారంలో న్యాయపరమైన కోణం కూడా అత్యంత కీలకం. 2025లో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పునిస్తూ, సీఏపీఎఫ్ లలో ఐపీఎస్ అధికారుల డెప్యుటేషన్‌ను క్రమంగా తగ్గించాలని, కేడర్ రివ్యూ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కూడా కోర్టు గత అక్టోబర్‌లో కొట్టివేసింది. అయితే, ప్రభుత్వం ఇప్పుడు తెచ్చిన నూతన చట్టం (2026) సుప్రీంకోర్టు ఆదేశాలను నీరుగార్చేలా ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కోర్టు తీర్పును అమలు చేయాల్సింది పోయి, దానికి విరుద్ధంగా చట్టాన్ని రూపొందించడం ద్వారా ఐపీఎస్ అధికారుల ప్రయోజనాలను కాపాడటానికే ప్రభుత్వం మొగ్గు చూపుతోందని విమర్శలు వస్తున్నాయి. న్యాయవ్యవస్థ ఆదేశాలను పక్కన పెట్టి తెచ్చిన ఈ చట్టం భవిష్యత్తులో మరిన్ని న్యాయపరమైన చిక్కులకు దారితీసే అవకాశం ఉందని రాహుల్ గాంధీ ద్వజమెత్తారు.
మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని సమర్థించుకుంటోంది. ఐదు రకాల కేంద్ర బలగాల్లో విడివిడిగా ఉన్న సేవా నియమాలను ఒకే తాటిపైకి తెచ్చి, ఏకీకృత పరిపాలన సాగించడానికి ఈ చట్టం ఎంతో అవసరమని ప్రభుత్వం వాదిస్తోంది. వివిధ రాష్ట్రాల పోలీసు వ్యవస్థలతో సమన్వయం చేసుకోవడానికి, జాతీయ భద్రతా వ్యూహాలను అమలు చేయడానికి ఐపీఎస్ అధికారుల అనుభవం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. నియామకాల్లో స్పష్టత తీసుకురావడానికి, వ్యవస్థను ఆధునీకరించడానికి ఇదొక సంస్కరణ అని కేంద్రప్రభుత్వం పేర్కొంది. అయితే, క్షేత్రస్థాయిలో పోరాడే కమాండెంట్లకు, ఉన్నతాధికారులకు మధ్య ఉన్న అంతరాన్ని ఈ చట్టం మరింత పెంచుతుందని, సీనియర్ కేడర్ అధికారులు నిరాశకు గురవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ వివాదం రాజకీయ రంగు పులుముకున్నప్పటికీ, దీని వెనుక ఉన్న సామాజిక, వృత్తిపరమైన ఆవేదన వాస్తవమైనది. దేశ రక్షణలో కీలకమైన పారామిలిటరీ దళాల్లో అంతర్గత ప్రజాస్వామ్యం, కెరీర్ ఎదుగుదల సమానంగా ఉన్నప్పుడే ఆ సంస్థలు మరింత సమర్థవంతంగా పనిచేయగలవు. రాహుల్ గాంధీ లేవనెత్తిన ఈ అంశం రాబోయే ఎన్నికల ప్రచారంలో కూడా ఒక ముఖ్యమైన చర్చాంశంగా మారే అవకాశం ఉంది. జవాన్ల హక్కులు, నాయకత్వ బాధ్యతల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. న్యాయం, గౌరవం, సమాన అవకాశాల ప్రాతిపదికన ఈ సమస్యకు పరిష్కారం లభించినప్పుడే మన సాయుధ బలగాల నైతిక బలం చెక్కుచెదరకుండా ఉంటుంది.
