
కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో 93 వేలకుపైగా ఖాళీలు
దేశంలోని కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సీఏపీఎఫ్‌స్) అస్సాం రైఫిల్స్‌లో మొత్తం 93,139 ఖాళీ పోస్టులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. బుధవారం కేంద్ర హోం శాఖ వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు. అందులో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో అత్యధికంగా 28,342 ఖాళీలు ఉండగా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో 27,400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 14,531, ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్‌లో 12,333, సశస్త్ర సీమాబల్‌లో 6,784 ఖాళీలు ఉన్నాయి. అస్సాం రైఫిల్స్‌లో 3,749 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఖాళీలు ఉన్నప్పటికీ అందుబాటులో ఉన్న సిబ్బందిని సమర్థంగా వినియోగిస్తూ భద్రత, రక్షణ వ్యవస్థ, విపత్తు స్పందన వంటి బాధ్యతలను దళాలు సమర్థంగా నిర్వహిస్తున్నాయని మంత్రి తెలిపారు. ఖాళీల భర్తీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, నియామకాలను వేగవంతం చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ల ద్వారా నియామకాలు చేపడుతున్నట్లు చెప్పారు. కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల కోసం ప్రతి ఏడాది నియామకాలు నిర్వహించడం, శారీరక పరీక్షల్లో ఆర్ఎఫ్ఐడీ సాంకేతికత వినియోగం వంటి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా సీఏపీఎఫ్‌స్ లో రాజీనామాల సంఖ్య పెరుగుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2021లో 1,255 మంది రాజీనామా చేయగా, 2025లో అది 2,333కు పెరిగింది. అయితే ఆత్మహత్యలు, సహోద్యోగి హత్యలు (ఫ్రాట్రిసైడ్), స్వచ్ఛంద పదవీ విరమణల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు చూపుతున్నాయి. 2021లో 10,828 ఉన్న స్వచ్ఛంద పదవీ విరమణలు 2025లో 4,291కు తగ్గాయి. కేంద్ర సాయుధ పోలీసు దళాల సిబ్బందికి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరణ అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టు లో విచారణలో ఉందని మంత్రి తెలిపారు. ఇదే సమయంలో మాజీ సిబ్బంది సంక్షేమం కోసం కేంద్రం వెల్ఫేర్ అండ్ రిహబిలిటేషన్ బోర్డును ఏర్పాటు చేసి, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయి సంక్షేమ అధికారులను నియమించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
