
కేంద్ర, రాష్ట్రాల నిర్లక్ష్యమే రైతుల కష్టాలకు కారణం: మాజీ మంత్రి హరీష్
రాష్ట్రంలో పత్తి, ఇతర పంటల రైతులు తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారని, కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ మంత్రి, హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ కేంద్రాన్ని సందర్శించి, పత్తి రైతుల ఇబ్బందులను తెలుసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా పత్తి రైతులు తీవ్రమైన ఆర్థిక మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో సుమారు 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతోందని, అయితే సీసీఐ తీసుకున్న 'తుగ్లక్' వంటి పిచ్చి నిర్ణయాల వల్ల రైతులు రోడ్ల పాలయ్యారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యంగా ఎల్1, ఎల్2, ఎల్3 విధానం, అలాగే కపాస్ యాప్‌లో 8 నుండి 12 శాతం తేమ మాత్రమే ఉండాలనే నిబంధనల వల్ల రాష్ట్రవ్యాప్తంగా జిన్నింగ్ మిల్లులన్నీ రెండు రోజులుగా మూతపడ్డాయని మంత్రి తెలిపారు.మద్దతు ధర అయిన రూ. 8,100 అందక, రైతులు పత్తిని దళారులకు రూ. 6,000కి అమ్మే పరిస్థితి వచ్చేసిందని హరీశ్ రావు తెలిపారు. దీంతో రైతులు ప్రతి క్వింటాలుకు రూ. 2,000 నష్టం చవిచూస్తున్నారని ఆయన చెప్పారు.
కేంద్రం, రాష్ట్రం మాటల్లో రైతులకు అండగా ఉన్నట్టు చెబుతున్నా చేతల్లో మాత్రం నరకం చూపిస్తున్నారని హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. వరదలు, తుఫాన్ల వల్ల పంటలు దెబ్బతిన్నా, కేంద్రం తీసుకున్న తేమ నిబంధనలు, ఆంక్షలు రైతుల భారాన్ని మరింత పెంచుతున్నాయని అన్నారు.విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకునేందుకు 11శాతం ఉన్న సుంకాన్ని రద్దు చేసి, దేశీయ రైతులకు అన్యాయం చేస్తున్నారని, ఇది బడా పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చే విధానం తప్ప మరొకటి కాదని విమర్శించారు.
60 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పత్తి రైతుల సమస్యల గురించి కేంద్రానికి విన్నవించే అవకాశం లేదా,ఓపిక లేదా? అని ఆయన ప్రశ్నించారు. బడేభాయితో మంచి సంబంధాలే ఉన్నాయి కదా, ఎందుకని పత్తి రైతుల గురించి చెప్పడం లేదు? అని హరీష్ రావు నిలదీశారు.ఉప ఎన్నికల్లో డబ్బులు పంచిన రేవంత్ రెడ్డి, పత్తి రైతులకు కనీస మద్దతు ధర అందించలేకపోతున్నారని విమర్శించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని, ఇప్పటివరకు 406 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆరోపించారు.ఎల్1, ఎల్2, ఎల్3 విధానాన్ని, 8-12 శాతం తేమ నిబంధనను, కపాస్ యాప్‌ను వెంటనే రద్దు చేయాలని, గత సంవత్సరం వలె 12 క్వింటాళ్ల పత్తి కొనాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మొక్కజొన్న, ఇతర సమస్యలు
ఇక మక్క రైతుల పరిస్థితి ఎనుమాముల మార్కెట్‌కు మక్కలు అమ్మడానికి వచ్చిన చింతకుంట, మంగపేట మండలాల రైతులు వెంకటేశ్వర్లు, లక్ష్మయ్యలను అడిగి తెలుసుకున్న వివరాల ప్రకారం, మక్కలకు రూ.2,400 మద్దతు ధర ఉండగా, రైతులు రూ.1,800కే అమ్ముతున్నారని, క్వింటాల్‌కు రూ.570 నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వమే ఇప్పటివరకు మక్క రైతులకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని మార్క్‌ఫెడ్ అధికారులు చెప్పారని హరీశ్ రావు వెల్లడించారు.
గత యాసంగి రైతులకు రావాల్సిన రూ. 1,100 కోట్లు బోనస్, ఈ సంవత్సరం కొనుగోళ్లకు సంబంధించిన రూ.1,400 కోట్ల బకాయిలను తక్షణం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పంటల బీమా, రైతుబంధు, ఎరువులు, విత్తనాలు, విద్యుత్ వంటి అంశాలన్నీ రైతులకు భారంగా మారాయని ఆయన ఆరోపించారు.వరంగల్ డిక్లరేషన్‌లో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ప్రశ్నించారు.
రాష్ట్రంలో గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు నోరు విప్పడం లేదని,పంట పొలాల్లోని దిష్టిబొమ్మలు కనీసం కోతులను, పక్షులను రాకుండా అడ్డుకుంటాయని, కానీ బీజేపీ ఎంపీలు ఆ మాత్రం పని కూడా చేయడం లేదని ఎద్దేవా చేశారు.దిగుమతి సుంకాలు ఎత్తివేసి రైతులపై ఆంక్షలు పెట్టడం బీజేపీ పద్ధతి. పత్తి, పామాయిల్ దిగుమతులపై సుంకం ఎత్తేసి ఎవరికి లాభం చేస్తున్నారు? ఎందుకు రైతుల మెడకు ఉరితాడు వేస్తున్నారు?బడా కాంట్రాక్టర్లకు, కార్పొరేట్లకు లాభం చేసేందుకు రైతులను అన్యాయం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఉత్తర భారత దేశంలో పండే గోధుమలకు ఒక నీతి దక్షిణ భారతదేశంలో పండే వడ్లకొక నీతి పెట్టిందని హరీష్ రావు ప్రశ్నించారు.
రైతుల సమస్యలను పరిష్కరించకపోతే బీఆర్ఎస్ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ, “తెల్ల బంగారం అయిన పత్తిని జూబ్లీహిల్స్ ప్యాలెస్ ముందు పోసి ముట్టడిస్తాం” అని హరీశ్ రావు హెచ్చరించారు.వరంగల్ వరదల్లో మునిగిపోయిన 20,000 ఇళ్లకు ప్రకటించిన రూ.15,000 నష్టపరిహారం ఇప్పటికీ ఇవ్వలేదని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
