Let's talk: editor@tmv.in
కేంద్ర ముందస్తు బడ్జెట్ సమావేశంలో తెలంగాణ డిప్యూటీ సీఎం

కేంద్ర ముందస్తు బడ్జెట్ సమావేశంలో తెలంగాణ డిప్యూటీ సీఎం

Gaddamidi Naveen
11 జనవరి, 2026

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం న్యూఢిల్లీలో రానున్న కేంద్ర బడ్జెట్ 2026-27 కోసం రాష్ట్రాలు, శాసనసభ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతాలతో ప్రీ-బడ్జెట్ సంప్రదింపుల సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభిప్రాయాలు, అవసరాలు, ప్రాధాన్యాలను నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేశారు.

ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీతో పాటు మణిపూర్ గవర్నర్, ఢిల్లీ, గోవా, హర్యానా, జమ్మూ-కాశ్మీర్, మేఘాలయ, సిక్కిం రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్ర‌ ఉప ముఖ్యమంత్రి భ‌ట్టీ విక్ర‌మార్క, వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు కూడా హాజరయ్యారు. ఆర్థిక వ్యవహారాలు, వ్యయాలు, ఆదాయ శాఖలకు చెందిన కార్యదర్శులు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రముఖ ఆర్థికవేత్తలతో ప్రీ-బడ్జెట్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీతో పాటు పలువురు ప్రముఖ ఆర్థిక నిపుణులు పాల్గొన్నారు. రానున్న కేంద్ర బడ్జెట్‌లో తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలు, ప్రాధాన్యాలు, విధానపరమైన సూచనలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

ఇదివరకే నిర్మలా సీతారామన్ 2026-27 కేంద్ర బడ్జెట్ తయారీకి భాగంగా మొత్తం 10 దఫాల ప్రీ-బడ్జెట్ సంప్రదింపులు నిర్వహించారు. ఈ సంప్రదింపుల్లో వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈలు, మూలధన మార్కెట్లు, తయారీ రంగం, సేవారంగం, సాంకేతికత వంటి ప్రధాన రంగాలకు చెందిన ప్రతినిధులు, నిపుణులు పాల్గొన్నారు. తొలి దశలో ప్రముఖ ఆర్థికవేత్తలతో, ఆ తర్వాత రైతు సంఘాలు వ్యవసాయ ఆర్థిక నిపుణులతో సమావేశాలు జరిగాయి.

తదుపరి దశల్లో ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు, మూలధన మార్కెట్లు, తయారీ, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, సమాచార సాంకేతికత, పర్యాటక, హాస్పిటాలిటీ రంగాలు, చివరగా కార్మిక సంఘాలు ట్రేడ్ యూనియన్లతో సంప్రదింపులు నిర్వహించారు. ఈ సమావేశాల్లో రంగాల నిపుణులు తమ సిఫార్సులు, ఎదురవుతున్న సవాళ్లు, బడ్జెట్‌పై ఉన్న అంచనాలను కేంద్రానికి వివరించారు.ఈ చర్చలు ప్రధానంగా ఆర్థిక వృద్ధి, ఉపాధి సృష్టి, పెట్టుబడుల ప్రోత్సాహం, సాంకేతిక అభివృద్ధి, పారిశ్రామిక పోటీతత్వం, ఆర్థిక రంగ స్థిరత్వం, కార్మిక సంక్షేమం, సుస్థిర అభివృద్ధి వంటి అంశాలపై కేంద్రీకృతమయ్యాయి.

సాధారణంగా కేంద్ర బడ్జెట్‌ను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఈ ఏడాదికీ అదే సంప్రదాయం కొనసాగనుందని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 2026-27 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.