
కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన మహారాష్ట్రలోని లాతూర్ పట్టణంలో ఉన్న తన స్వగృహం ‘దేవ్‌ఘర్’లో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. ఆయన అంత్యక్రియలు శనివారం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. శివరాజ్ పాటిల్‌కు కుమారుడు శైలేష్ పాటిల్, కోడలు అర్చన (వీరు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేశారు), ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు.
శివరాజ్ పాటిల్ రాజకీయ ప్రస్థానం
శివరాజ్ పాటిల్ 1935 అక్టోబర్ 12న లాతూర్ జిల్లాలో జన్మించారు. ఆయన తన ప్రజా జీవితాన్ని 1966లోనే ప్రారంభించి, 1966 నుండి 1970 వరకు లాతూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి, 1977-1979 మధ్య మహారాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచారు. ఆ సమయంలో ఆయన డిప్యూటీ స్పీకర్‌గా, ఆపై స్పీకర్‌గా కూడా పనిచేశారు. కేంద్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టి, లాతూర్ లోక్‌సభ స్థానం నుంచి ఏకంగా ఏడు సార్లు విజయం సాధించారు. ముఖ్యంగా ఆయన 1991 నుండి 1996 వరకు 10వ లోక్‌సభకు స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన స్పీకర్‌గా ఉన్నప్పుడే 'ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు' మొదలుపెట్టారు. కేంద్రంలో రక్షణ, వాణిజ్యం, శాస్త్ర సాంకేతికత వంటి ముఖ్యమైన శాఖలకు మంత్రిగా సమర్థవంతంగా సేవలు అందించారు. అనంతరం 2004 నుండి 2008 వరకు కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు. రాజకీయాల నుంచి వైదొలిగిన తర్వాత కూడా 2010 నుండి 2015 వరకు పంజాబ్ రాష్ట్ర గవర్నర్‌గా, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్‌గా బాధ్యతలు నిర్వర్తించి, ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం ఉన్నత పదవుల్లో ఉన్నారు.
శివరాజ్ పాటిల్ రాజకీయ జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం 26/11 ముంబై ఉగ్రదాడుల ఘటన. 2008లో ముంబైపై జరిగిన భయంకరమైన ఉగ్రదాడుల తరువాత, భద్రతా వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన కేంద్ర హోంమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ ఘటన సమయంలో ఆయన దుస్తులు మార్చుకోవడంపై విమర్శలు వచ్చాయి. అయితే దీనిపై స్పందిస్తూ, ప్రజలు విధానాలను విమర్శించాలి తప్ప దుస్తులను కాదని ఆయన చెప్పుకొచ్చారు.
రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
శివరాజ్ పాటిల్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్.సి.పి (శరద్ పవార్ వర్గం) అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా అనేక మంది రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనను విశిష్ట పార్లమెంటేరియన్, అనుభవజ్ఞుడైన నాయకుడిగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ, ఆయన ప్రజా సేవ, హుందాతనం రాజకీయాలకు ఆదర్శమని, ఆయన మరణం తీరని లోటని అన్నారు. శరద్ పవార్ కాంగ్రెస్ సిద్ధాంతాన్ని, ప్రజల సమస్యలను పరిష్కరించే ఆయన నిబద్ధతను గుర్తు చేసుకున్నారు.
