
కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు మృతి, ప్రముఖుల సంతాపం
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు తనదైన ముద్ర వేసిన సీనియర్ నాయకుడు , కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు (82) బుధవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఆరితేరిన నేతగా, ఐదుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి.
రాజకీయ ప్రస్థానం
1943 అక్టోబర్ 1న జన్మించిన కావూరి సాంబశివరావు, విద్యావంతుడైన రాజకీయ నాయకుడిగా పేరుపొందారు. వరంగల్ నీట్ నుంచి ఇంజినీరింగ్ పట్టా పొందిన ఆయన, అటు వ్యాపార రంగంలో పారిశ్రామికవేత్తగా రాణిస్తూనే.. ఇటు ప్రజాసేవ వైపు అడుగులు వేశారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన కావూరి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.
ఆయన తన రాజకీయ జీవితంలో ఏకంగా ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. మచిలీపట్నం నియోజకవర్గం నుంచి మూడుసార్లు (1984, 1989, 1998), ఏలూరు నియోజకవర్గం నుంచి రెండుసార్లు (2004, 2009) ఎంపీగా గెలుపొంది, అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 2013లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పనిచేసి, దేశవ్యాప్తంగా చేనేత, జౌళి రంగాల అభివృద్ధికి అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన భారతీయ జనతా పార్టీలో చేరినప్పటికీ, వృద్ధాప్య కారణాల వల్ల గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
ప్రముఖుల* *సంతాపం
కావూరి మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "కృష్ణా జిల్లా రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతలు గడించిన కావూరి సాంబశివరావు గారి మృతి రాజకీయ రంగానికి తీరని లోటు. ఐదుసార్లు ఎంపీగా గెలిచి, కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన నియోజకవర్గాల అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారు. రాజకీయ, వ్యాపార రంగంలో కావూరి గారిది ప్రత్యేక ముద్ర. ప్రజాసేవలో ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఎప్పటికీ చిరస్మరణీయం. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను" అని సీఎం పేర్కొన్నారు.
ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అయిదుసార్లు లోక్ సభకు ఎన్నికైన శ్రీ సాంబశివరావు గారు సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ఉన్నారు. ఆయన మనవడు, విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ గారికి, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని తెలిపారు.
రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ, కావూరి తమ కుటుంబానికి అత్యంత సన్నిహితులని, బంధువులని గుర్తుచేసుకున్నారు. "రాజకీయ కురువృద్ధులు కావూరి గారి మృతి అత్యంత బాధాకరం. ఐదుసార్లు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర ప్రగతి కోసం ఎనలేని కృషి చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని తన సోషల్ మీడియా ఎక్స్‌లో తెలిపారు.
అదేవిధంగా, రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కావూరి మృతికి సంతాపం తెలిపారు. "మచిలీపట్నం ఎంపీగా రెండుసార్లు, ఏలూరు ఎంపీగా మూడుసార్లు గెలిచి రాజకీయ రంగంలో ఆయన చెరగని ముద్ర వేశారు. ఆయన మృతి రాజకీయ రంగానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను" అని పేర్కొన్నారు.
మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందిస్తూ, బీజేపీ సీనియర్ నాయకులు కావూరు సాంబశివరావు పరమపదించారని తెలిసి విచారించాను. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఐదుసార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించి ప్రజాసేవలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు. నిర్మాణ రంగంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ, వారి ఆత్మకు భగవంతుడు సద్గతులు కలిగించాలని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు.
అలాగే, ఏపి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బీజేపీ నేత సుజనా చౌదరి, బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ అద్యక్షుడు కేటీఆర్, గోరంట్ల మాదవ్, మెగా స్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ వంటి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కావూరి మృతి పట్ల తమ ప్రగాడ సానుభూతిని తెలిపారు.
కాగా, కావూరి సాంబశివరావుకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విశాఖపట్నం ఎంపీ ఎం. శ్రీభరత్ కావూరి గారికి స్వయానా మనవడు. కావూరి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచిన అనంతరం, గురువారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
