Let's talk: editor@tmv.in
కేంద్ర మంత్రులతో తెలంగాణ సీఎం భేటీ

కేంద్ర మంత్రులతో తెలంగాణ సీఎం భేటీ

Sirisha B
13 ఫిబ్రవరి, 2026

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి చివరి వారంలో ఈసా–మూసీ నదుల సంగమ ప్రాంతంలో చేపట్టనున్న ప్రతిష్ఠాత్మక ‘గాంధీ సరోవర్ ప్రాజెక్టు’ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలని కేంద్ర మంత్రిని సీఎం ఆహ్వానించారు.

ఈసా, మూసీ నదుల సంగమ ప్రాంతానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యతను సీఎం రేవంత్ రెడ్డి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. 1948 ఫిబ్రవరిలో మహాత్మా గాంధీ చితాభస్మాన్ని ఇదే సంగమ స్థలంలో నిమజ్జనం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, దేశ చరిత్రలో ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేక స్థానాన్ని వివరించారు. గాంధీజీ స్మృతులను సజీవంగా నిలిపే ఉద్దేశంతోనే ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టును రూపకల్పన చేసినట్లు తెలిపారు.

ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగానే గాంధీ సరోవర్ ను అభివృద్ధి చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ఇది కేవలం జలాశయంగా మాత్రమే కాకుండా, గాంధీ సిద్ధాంతాలు, విలువలు, జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచేలా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు.

అదేవిధంగా, ఈ ప్రాంతంలో ఉన్న బాపుఘాట్ ను భవిష్యత్తులో ప్రపంచ స్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని సీఎం రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. దేశ, విదేశాల నుంచి సందర్శకులు వచ్చేలా గాంధీ మార్గాన్ని పరిచయం చేసే కేంద్రంగా బాపుఘాట్‌ను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి దిశను వివరించే తెలంగాణ విజన్ డాక్యుమెంట్–2047 ను సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి అందజేశారు. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, అనిల్ కుమార్ గౌడ్, వంశీకృష్ణ, కడియం కావ్య పాల్గొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని, సమన్వయంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా చర్చించారు.

ఈసా-మూసీ నదుల సంగమ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు అమలుకు అవసరమైన రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదలాయించాలని ముఖ్యమంత్రి కోరారు. జాతీయ సమైక్యత, గాంధీ విలువలను ప్రతిబింబించే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చేయూత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రాజెక్టు కోసం అక్కడ ఉన్న 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటనలో భాగంగా పలు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ముఖ్యంగా రాష్ట్రానికి కీలకమైన మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణం, కృష్ణా–వికరాబాద్ రైలు మార్గం, వానాకాల పంట భద్రత వంటి అంశాలను ప్రధానంగా చర్చించారు.

మామునూర్ ఎయిర్‌పోర్ట్‌ పనులను ప్రారంభించండి

సభలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని, భూసేకరణ ప్రక్రియ పూర్తయినందున పనులు వెంటనే ప్రారంభించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఈ ఎయిర్‌పోర్ట్‌లో కార్గో, మెయింటెనెన్స్, ఓవర్ హాల్ రిపేర్ సౌకర్యాలు ఉండేలా చూడమని సూచించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాలకు కేంద్రంగా పనిచేసే విధంగా ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేయాలని అన్నారు. భవిష్యత్తులో అవసరమయ్యే 249.82 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉందని కూడా తెలిపారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులను అక్కడకు పంపించి పనులు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.

సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కృష్ణా–వికరాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధులతో చేపట్టాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు విజ్ఞప్తి చేశారు. భూసేకరణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని వివరించారు. అలాగే, హైదరాబాదు–చెన్నై, హైదరాబాదు–బెంగ‌ళూరు, హైదరాబాదు–పుణే హైస్పీడ్ రైలు కారిడార్లను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రారంభించాలని సూచించారు. రైల్వే మంత్రి సానుకూల ప్రతిస్పందనతో పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుమతించాలి

వానాకాల పంటకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి కీలక అంశాలను ముందుకు తెచ్చారు. 2025–26 సీజన్‌లో అదనంగా సేకరించిన 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) తీసుకోవాలని, 2024–25 యాసంగి పంటకు 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుమతించాలని కోరారు. 2014–15 వానాకాల పంటకు బకాయిగా ఉన్న రూ.1,468.94 కోట్లతో పాటు పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద అందజేయాల్సిన 343.27 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. సభలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, సురేష్ షెట్కార్, రామసహాయం రఘురాం రెడ్డి, డాక్టర్ కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అన్ని అంశాలపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని, అవసరమైన చర్యలు వెంటనే ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు.

అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికలు, త్వరలో రానున్న గ్రేటర్ ఎన్నికల సన్నద్ధతపై వారు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పార్టీ బలోపేతంపై ఈ భేటీలో కీలక చర్చలు జరిగినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.