Let's talk: editor@tmv.in
కేంద్ర మంత్రులకు మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ

కేంద్ర మంత్రులకు మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ

Gaddamidi Naveen
11 మార్చి, 2026

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల కేటాయింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన ఆ లేఖలో కోరారు. కేంద్రం ఇచ్చే నిధులు దయ కాదని, అవి తెలంగాణ ప్రజల హక్కు అని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం పార్లమెంట్‌లో జరుగుతున్న కేంద్ర బడ్జెట్ చర్చల్లో తెలంగాణకు రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి మాట్లాడాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. పక్క రాష్ట్రాలకు బడ్జెట్‌లో భారీ నిధులు ఇస్తున్నప్పుడు, తెలంగాణకు అందులో కనీసం సగమైనా ఎందుకు ఇవ్వరు? అని ఆయన ప్రశ్నించారు.

లేఖలోని ప్రధాన డిమాండ్లు

హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్–2 ప్రాజెక్ట్‌కు 24 వేల కోట్ల రూపాయలకుపైగా ఖర్చు అవుతుందని, అందులో కేంద్రం 50 శాతం నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నదని తెలిపారు. అలాగే ముసి నది పునరుద్ధరణ, రివర్‌ఫ్రంట్ అభివృద్ధి, రీజినల్ రింగ్ రోడ్ దక్షిణ భాగానికి అనుమతి, హైదరాబాద్–వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్‌కు పూర్తి ఆమోదం ఇవ్వాలని కోరారు. విభజన సమయంలో హామీ ఇచ్చిన బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రాజెక్టులను వెంటనే అమలు చేయాలని పేర్కొన్నారు.

కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కేంద్రం తన వాటాను తగ్గించుకుంటూ రాష్ట్రాలపై భారం మోపుతోందని మంత్రి విమర్శించారు. పన్నుల వాటాలో న్యాయం చేయాలని, కేంద్ర వాటాను తిరిగి 90 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. కిసాన్ సమ్మాన్ నిధి, సామాజిక పెన్షన్లను పెరిగిన ధరలకు అనుగుణంగా సవరించాలన్నారు.

ఇక తెలంగాణకు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ప్రకటించడమే కాకుండా కొత్త జాతీయ రహదారులు, మరో ఎయిమ్స్ స్థాయి ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరారు. రామప్ప, యాదాద్రి ఆలయాలను జాతీయ స్థాయి టూరిజం ప్రాజెక్టులుగా అభివృద్ధి చేయాలని సూచించారు. తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు గడిచినా విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రం నుంచి ఇద్దరు బీజేపీ కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రంపై వివక్ష కొనసాగడం తగదని ఆయన లేఖలో పేర్కొన్నారు.