Let's talk: editor@tmv.in
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి భేటీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి భేటీ

Gaddamidi Naveen
30 జులై, 2026

వైయస్ఆర్‌ జిల్లాలో రహదారుల అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి బుధవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. జిల్లాలోని పలు కీలక రహదారుల విస్తరణతో పాటు పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ముద్దనూరు నుంచి కడప వరకు ఉన్న రహదారిని నాలుగు లైన్ల జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని ఎంపీ కోరారు. అలాగే కడప నగరంలోని ఇర్కాన్‌ సర్కిల్‌ నుంచి జేఎంజే సర్కిల్‌ వరకు ఉన్న రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఇర్కాన్‌ సర్కిల్‌ నుంచి ఐటీఐ సర్కిల్‌ వరకు ఫుట్‌పాత్‌లు, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ, ఇంటర్‌లాకింగ్‌ పేవర్డ్‌ బ్లాక్స్‌తో పార్కింగ్‌ సదుపాయాలు ఏర్పాటు చేయాలని కూడా వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఎంపీ ప్రతిపాదనలను కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సానుకూలంగా పరిశీలించారు. సంబంధిత అధికారులతో చర్చించి ప్రతిపాదిత అభివృద్ధి పనులను త్వరలోనే చేపట్టేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు ఎంపీ కార్యాలయం వెల్లడించింది. జిల్లాలో రహదారుల విస్తరణ, పట్టణ మౌలిక వసతుల మెరుగుదల ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఎంపీ అవినాష్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు
YSAvinashReddyNitinGadkariKadapaYSRDistrictRoadDevelopmentInfrastructureNationalHighwaysAndhraPradeshKadapaDevelopment
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి భేటీ - Tholi Paluku