Let's talk: editor@tmv.in
కేంద్ర బడ్జెట్ 2026-27: వృద్ధిపై ఇండియా ఇంక్ ధీమా

కేంద్ర బడ్జెట్ 2026-27: వృద్ధిపై ఇండియా ఇంక్ ధీమా

Dantu Vijaya Lakshmi Prasanna
28 జనవరి, 2026

వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27) సంబంధించి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో భారత పారిశ్రామిక రంగం గట్టి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని ప్రముఖ పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ని ర్వహించిన తాజా 'ప్రీ-బడ్జెట్ సర్వే' వెల్లడించింది.

7-8 శాతం జీడీపీ వృద్ధిపై ఆశలు

ఈ సర్వేలో పాల్గొన్న ప్రతినిధుల్లో దాదాపు 80 శాతం మంది దేశ ఆర్థిక వృద్ధి రేటుపై పూర్తి విశ్వాసాన్ని ప్రకటించారు. ముఖ్యంగా వచ్చే ఏడాది దేశ జీడీపీ వృద్ధి 7 నుండి 8 శాతం మధ్య నమోదవుతుందని సగానికి పైగా పారిశ్రామికవేత్తలు అంచనా వేయడం విశేషం. ద్రవ్యలోటును 4.4 శాతానికి పరిమితం చేయాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని మెజారిటీ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

పరిశ్రమల రంగం ప్రధాన డిమాండ్లు:

బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెట్టాలని పరిశ్రమల వర్గాలు కోరుతున్నాయి.

ఉపాధి కల్పన:

భారతదేశంలోని పెరుగుతున్న యువశక్తికి తగిన ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యం కావాలని ఫిక్కీ సర్వే నొక్కి చెప్పింది. ముఖ్యంగా తయారీ,సేవా రంగాలలో కొత్త ఉద్యోగాలను సృష్టించే కంపెనీలకు ప్రభుత్వం ప్రత్యేక పన్ను రాయితీలు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. నైపుణ్యాభివృద్ధి కోసం కేటాయింపులను పెంచడం ద్వారా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా యువతను సిద్ధం చేయాలని, తద్వారా నిరుద్యోగ సమస్యను తగ్గించడమే కాకుండా దేశ ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేయవచ్చని ఇండియా ఇంక్ బలంగా విశ్వసిస్తోంది.

మౌలిక సదుపాయాలు:

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగానికి నిరంతర మద్దతు ఇస్తూ దేశ ఆర్థిక వృద్ధిని పరుగులు తీయించేందుకు మౌలిక సదుపాయాల రంగానికి నిరంతర మద్దతు, భారీ కేటాయింపులు కొనసాగించాలని పరిశ్రమల వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

ముఖ్యంగా రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడానికి మెరుగైన కనెక్టివిటీ అవసరమని, ఇది దేశీయ వ్యాపారాల సామర్థ్యాన్ని పెంచుతుందని ఫిక్కీ సర్వే పేర్కొంది.

ఎగుమతుల ప్రోత్సాహం:

మరోవైపు, గ్లోబల్ ట్రేడ్ సమస్యలను, అంతర్జాతీయ నిబంధనలను ఎదుర్కోవడానికి ఎగుమతిదారులకు వెన్నుదన్నుగా నిలవాలని ఇండియా ఇంక్ ఆశిస్తోంది. ఇందులో భాగంగానే "ఎగుమతి చేసిన ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల మినహాయింపు పథకం" వంటి పథకాల కింద నిధులను పెంచాలని, కస్టమ్స్ సుంకాలను సరళతరం చేయాలని లాజిస్టిక్స్ అడ్డంకులను తొలగించడం ద్వారా భారతీయ ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్‌లో గట్టి పోటీనిచ్చేలా చేయాలని పారిశ్రామికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.

రక్షణ, ఎలక్ట్రానిక్స్ రంగాలకు పెద్దపీట!

మేక్ ఇన్ ఇండియాను బలోపేతం చేసే దిశగా ఎలక్ట్రానిక్స్ తయారీకి ఒక "మెగా క్లస్టర్" ఏర్పాటు చేయాలని ఫిక్కీ సూచించింది. ఇక రక్షణ రంగం విషయంలో మరింత దూకుడుగా వ్యవహరించాలని కోరుతూ.. రక్షణ బడ్జెట్ కేటాయింపుల్లో మూలధన వ్యయాన్ని 30 శాతానికి పెంచాలని ప్రతిపాదించింది. దీనివల్ల డ్రోన్లు, కృత్రిమ మేధ, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలో భారత్ స్వయంసమృద్ధి సాధిస్తుందని పేర్కొంది.

పన్నుల సరళీకరణ, సంస్కరణల

వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు కస్టమ్స్ టారిఫ్ రేట్లను కేవలం మూడు స్థాయిలకే పరిమితం చేయాలని పరిశ్రమ కోరుతోంది. పన్ను వివాదాల వేగవంతమైన పరిష్కారం, డిజిటలైజేషన్ ఎగుమతి ప్రోత్సాహక పథకమైన " ఎగుమతి చేసిన ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల మినహాయింపు పథకం" కింద నిధుల పెంపు వంటి కీలక మార్పుల కోసం ఇండియా ఇంక్ ఎదురుచూస్తోంది.

మొత్తంగా, వృద్ధిని వేగవంతం చేస్తూనే ఆర్థిక క్రమశిక్షణను పాటించే సమతుల్య బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారని భారత పారిశ్రామిక లోకం ఆశిస్తోంది.

కాగా, భారత జాతీయ గణాంక కార్యాలయం జనవరి 2026లో విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో భారత జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేయబడింది. ఇది గత ఆర్థిక సంవత్సరం (2024-25) లో నమోదైన 6.5 శాతం కంటే గణనీయమైన పెరుగుదల కావడం విశేషం. ముఖ్యంగా సేవల రంగం 9.1 శాతం వృద్ధిని సాధించడంతో పాటు, తయారీ రంగం కూడా 7 శాతానికి పుంజుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిచ్చింది. దీనికి తోడు అంతర్జాతీయ ద్రవ్య నిధి కూడా తన అంచనాలను 7.3 శాతానికి పెంచడం, ప్రపంచవ్యాప్తంగా ఒడిదొడుకులు ఉన్నప్పటికీ భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోందని స్పష్టం చేస్తోంది.