
కేంద్ర బడ్జెట్ 2026-27: 'వికసిత భారత్-2047' దిశగా బలమైన పునాది - కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
2026-27 కేంద్ర బడ్జెట్ భారతదేశ వందేళ్ల స్వాతంత్ర్య సంబరాలు జరుపుకునే 2047 నాటికి దేశాన్ని 'వికసిత భారత్'గా మార్చే లక్ష్యంతో రూపొందించబడిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బడ్జెట్ ముఖ్యాంశాలను విశ్లేషించారు.
2013లో భారత్‌ను ఫ్రాజైల్ ఫైవ్ ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా పరిగణించేవారని, విదేశీ పెట్టుబడులపై అధికంగా ఆధారపడిన దేశంగా అప్పట్లో గుర్తింపు ఉన్నప్పటికీ, ప్రస్తుతం దేశం ‘వికసిత భారత్-2047’ లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతోందని జోషి తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్పులు చోటుచేసుకునే సమయంలో భారత్ ముందంజలో నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని, నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన దేశం త్వరలోనే మూడో స్థానాన్ని సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విడుదల చేసిందని జోషి తెలిపారు. ఈ బడ్జెట్ తక్షణ ప్రయోజనాలకే కాకుండా దీర్ఘకాలిక దృష్టితో రూపొందించబడిందని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పలు కార్యక్రమాలు ప్రకటించబడినట్లు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను విద్యుత్, ఇంటర్నెట్‌లాంటి మార్పును తీసుకువచ్చే సాంకేతిక విప్లవంగా అభివర్ణిస్తూ, దేశంలో ఏఐ అభివృద్ధి కోసం ప్రత్యేక ఏఐ మిషన్‌ను కేంద్రం ప్రకటించి నిధులు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.
దేశ అభివృద్ధికి కీలకమైన క్రిటికల్ మినరల్స్ ప్రాముఖ్యతపై గతంలో సరైన అవగాహన లేకపోయిందని ఆయన విమర్శించారు. సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రజన్ వంటి రంగాలకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం క్రిటికల్ మినరల్స్ మిషన్‌ను ప్రారంభించిందని తెలిపారు. అలాగే 2016 నుంచి 2025 మధ్య దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ ఆరు రెట్లు పెరిగిందని ఆయన చెప్పారు.
బడ్జెట్‌లో ప్రకటించిన బయోఫార్మా శక్తి పథకం దేశీయ బయోఫార్మాస్యూటికల్ తయారీ సామర్థ్యాన్ని పెంపొందించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నదని జోషి వివరించారు. ఈ పథకం ద్వారా భారత్‌ను ప్రపంచ స్థాయి బయోఫార్మా తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దేశంలో సరుకు రవాణా నిల్వ ఖర్చులు తగ్గుముఖం పట్టాయని, అయినప్పటికీ వాటిని ప్రపంచ స్థాయి ప్రమాణమైన సుమారు ఆరు శాతానికి తగ్గించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, రవాణా రంగంలో పెట్టుబడులు ఈ దిశగా కీలక పాత్ర పోషిస్తాయని ఆయన చెప్పారు.
తెలంగాణ రాష్ట్రానికి గత 12 ఏళ్లలో పన్నుల వాటా, జాతీయ రహదారులు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టుల రూపంలో కేంద్ర ప్రభుత్వం రూ.12 లక్షల కోట్ల మేర సహాయం అందించిందని జోషి పేర్కొన్నారు. రైల్వేలు, జాతీయ రహదారులు సహా పలు రంగాలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ద్వేషపూరిత ప్రసంగాల నిరోధక చట్టం గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఏఐఎంఐఎం నేతలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో ద్వేషపూరిత ప్రసంగాలు చేసేవారు చాలా మంది ఉన్నారు. ఇప్పటికే చట్టంలో నిబంధనలు ఉన్నాయి, వారిపై చర్యలు తీసుకోవచ్చు. న్యాయవ్యవస్థ కూడా ఉంది అని అన్నారు.
ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికలతో పాటు భవిష్యత్తులో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తుందనే నమ్మకం తనకు ఉందని కేంద్ర మంత్రి తెలిపారు.
