Let's talk: editor@tmv.in
కేంద్ర బడ్జెట్‌ 'వికసిత్ భారత్'కు దిక్సూచి: సీఎం చంద్రబాబు

కేంద్ర బడ్జెట్‌ 'వికసిత్ భారత్'కు దిక్సూచి: సీఎం చంద్రబాబు

Shaik Mohammad Shaffee
2 ఫిబ్రవరి, 2026

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన 'ఫార్వర్డ్ లుకింగ్' బడ్జెట్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. కుప్పం పర్యటనలో ఉన్న ఆయన, బడ్జెట్ కేటాయింపులపై స్పందిస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లకు ధన్యవాదాలు తెలిపారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ఈ బడ్జెట్ బలమైన పునాది వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రగతికి ఊతమిచ్చే హైస్పీడ్ రైల్ కారిడార్లు

రాష్ట్ర అభివృద్ధిలో రవాణా వ్యవస్థ కీలకమని భావిస్తున్న తరుణంలో, కేంద్రం ప్రకటించిన మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లు ఆంధ్రప్రదేశ్‌కు వరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, బెంగళూరు-చెన్నై కారిడార్ల ద్వారా అమరావతి, తిరుపతి, పలమనేరు, చిత్తూరు వంటి కీలక ప్రాంతాలు అనుసంధానమవుతాయని చెప్పారు. ఈ కారిడార్ల వల్ల ప్రధాన నగరాల మధ్య అనుసంధానత పెరిగి, ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం అవుతాయని వివరించారు. అలాగే 'డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్'లో ఏపీకి చోటు దక్కడం వల్ల ఖనిజాల వెలికితీత, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లో రాష్ట్రం దూసుకుపోతుందని ధీమా వ్యక్తం చేశారు.

సాంకేతికత, ఎంఎస్ఎంఈలకు పెద్దపీట

రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న ఎంఎస్ఎంఈ రంగం బలోపేతానికి ఈ బడ్జెట్ ఎంతో సహకరిస్తుందని చంద్రబాబు అన్నారు. 75 శాతం ఎంఎస్ఎంఈలకు కేంద్రం క్రెడిట్ గ్యారెంటీ ఇవ్వడం శుభపరిణామమని, రాష్ట్రం తరఫున మరో 20 శాతం మద్దతు ఇస్తున్నామని గుర్తుచేశారు. "ఏఐ, సెమీ కండక్టర్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీలకు ఏపీ కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంది. ఐఎస్ఎం 2.0 కింద సెమీ కండక్టర్ రంగానికి రూ. 40 వేల కోట్లు కేటాయించడం హర్షణీయం. విశాఖకు గూగుల్ వంటి దిగ్గజ సంస్థల డేటా సెంటర్లు వస్తున్నాయి. 2047 వరకు వీటికి పన్ను మినహాయింపులు ఇవ్వడం వల్ల భారత్ గ్లోబల్ డేటా హబ్‌గా మారుతుంది" అని ఆయన పేర్కొన్నారు.

పర్యాటక ప్రాభవం.. రాయలసీమకు 'పూర్వోదయ' ఫలాలు

రాష్ట్రంలోని పర్యాటక రంగ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి వివరించారు. అరకు రీజియన్‌తో పాటు, పులికాట్ సరస్సు అభివృద్ధికి నిధులు కేటాయించడం వల్ల పర్యాటకం కొత్త పుంతలు తొక్కుతుందని చెప్పారు. పులికాట్‌కు వచ్చే అరుదైన ఫ్లెమింగో పక్షులు కూడా పర్యాటకులను ఆకర్షిస్తాయన్నారు. ఉద్యానవన పంటలైన కొబ్బరి, జీడిమామిడి, కోకో, చందనం సాగుకు బడ్జెట్ ఊతమిస్తోందని, తద్వారా రాయలసీమ జిల్లాలు ప్రపంచంలోనే అత్యుత్తమ హార్టికల్చర్ క్లస్టర్లుగా అవతరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 'పూర్వోదయ' పథకం ద్వారా వచ్చే నిధులతో రాయలసీమను తదుపరి స్థాయికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

ఈజ్ ఆఫ్ లివింగ్.. సంజీవని ప్రాజెక్టు

ఈ బడ్జెట్ మహిళలు, రైతులు, యువత సాధికారితకు పెద్దపీట వేసిందని చంద్రబాబు కొనియాడారు. 'వన్ ఫ్యామిలీ - వన్ ఎంటర్‌ప్రెన్యూర్' విధానం ద్వారా ప్రతి ఇంటికి ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని చెప్పారు. వైద్య రంగంలో 'సంజీవని ప్రాజెక్టు' గేమ్ ఛేంజర్‌గా మారబోతోందని, ఇది బయో సైన్సెస్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని వివరించారు. 1000 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఏపీకి 'ఈస్ట్ కోస్ట్ కారిడార్' మరియు అంతర్గత జల రవాణా నిధులు లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన వృద్ధిని తెస్తాయన్నారు. త్వరలో బిల్ గేట్స్ అమరావతికి రాబోతున్నారని, 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.