Let's talk: editor@tmv.in
కేంద్ర నిధులతో గ్రామాల అభివృద్ధి: ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

కేంద్ర నిధులతో గ్రామాల అభివృద్ధి: ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Gaddamidi Naveen
12 మార్చి, 2026

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమని బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.బుధవారం నిర్మల్ రూరల్ మండలంలోని తల్వేద, లంగ్డాపూర్, వెంగ్వాపేట్ గ్రామాల్లో రూ. 2.13 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

తల్వేద గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో స్వయం సహాయక సంఘాల (ఎస్.హెచ్.జి) భవన నిర్మాణం, రూ.10 లక్షలతో వర్కింగ్ షెడ్, రూ.12 లక్షలతో అంగన్వాడీ భవనం, అలాగే రూ.10 లక్షలతో ఎంపీపీఎస్ పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు ఆయన ప్రారంభం పలికారు.

అలాగే నిర్మల్ రూరల్ మండలంలోని లంగ్డాపూర్ గ్రామంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ గ్రామంలో రూ.10 లక్షలతో భవనం, రూ.10 లక్షలతో వర్కింగ్ షెడ్ నిర్మాణం, రూ.24 లక్షల వ్యయంతో రెండు అంగన్వాడీ భవనాలు, రూ.10 లక్షలతో ఎంపీపీఎస్ పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలు, చిన్నారుల విద్యాభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ పనులు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.

వెంగ్వాపేట్ గ్రామంలో ఈ గ్రామంలో అత్యధికంగా రూ. 97 లక్షల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో రూ. 20 లక్షలతో రెండు ఎస్.హెచ్.జి భవనాలు, రూ. 20 లక్షలతో రెండు వర్కింగ్ షెడ్లు, రూ. 12 లక్షలతో అంగన్‌వాడీ భవనం రూ. 45 లక్షలతో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కాంపౌండ్ నిర్మాణ పనులు ఉన్నాయి.

అభివృద్ధి పనులతో పాటు, వెంగ్వాపేట్ గ్రామంలోని ప్రాథమిక పశువైద్య కేంద్రంలో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులు తమ పశుసంపదను కాపాడుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మహేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు.

కేంద్ర నిధులతో గ్రామాల అభివృద్ధి: ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి - Tholi Paluku